కనిష్టం.. ఎంత కష్టం! | Sakshi
Sakshi News home page

కనిష్టం.. ఎంత కష్టం!

Published Tue, Aug 19 2014 1:00 AM

కనిష్టం.. ఎంత కష్టం!

  •       కనిపించని కారుమేఘాలు
  •      65 మి.మీ కనిష్ట వర్షపాతం నమోదు
  •      భీమునిపట్నంలో సాధారణ వర్షపాతం
  •      25 మండలాల్లో కనిష్టం, 12 మండలాల్లో స్వల్పం
  • నర్సీపట్నం రూరల్ : ఈ ఏడాదీ అనావృష్టి వెంటాడుతోంది. వర్షాకాలం వెక్కిరిస్తోంది. కారుమేఘం జాడకూడా కనిపించక అన్నదాత గుండె బరువెక్కుతోంది. కాలక్రమేణా పరిస్థితి అనుకూలిస్తుందని భావించిన రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వర్షం కురవకపోగా, ఎండలు మండిపోతూ ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు తడిసిన భూములు సైతం ఎండలకు ఆరిపోయి, ఎండిపోతున్నాయి.
     
    ఆగస్టు ప్రారంభం నుంచి 18 వరకు పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా -65 మి.మీ వర్షపాతం కనిష్టంగా నమోదయ్యింది. ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 196.5 మి.మీ కాగా 68.5 మాత్రమే నమోదయ్యింది. ఈ విధంగా జిల్లాలోని 38 మండలాల్లో పరిస్థితిని చూస్తే 12 మండలాల్లో తక్కువ (-60మి.మీ వరకు), 25 మండలాల్లో కనిష్టంగా (-60 మి.మీకి మించి) నమోదయ్యింది.

    జిల్లాలో కేవలం భీమునిపట్నం మండలంలోనే సాధారణ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఏజెన్సీలో 11 మండలాల్లో సైతం ఏడింటిలో కనిష్ట వర్షపాతం నమోదైంది. 90కి మించి 100 మి.మీ లోపు వర్షపాతం గల మండలాల జాబితాలో మాకవరపాలెం, సబ్బవరం, కోటవురట్ల, బుచ్చియ్యపేట ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    దీని ప్రభావం వల్ల ఖరీఫ్ వరి నాట్లు ఊపందుకోవడం లేదు. కేవలం నీటి సదుపాయం ఉన్న తాండవ, పెద్దేరు, రైవాడ వంటి ప్రాజెక్టులతో పాటు బోర్లు వసతి ఉన్న భూముల్లోనే నాట్లు వేస్తున్నారు. మిగిలిన వర్షాధార భూముల్లో ఇప్పటికే నారుమళ్లు వేసి అలానే వదిలేశారు. కొన్ని ప్రాంతాల్లో బిందెలు, ఇంజన్లతో నారు తడిపి బతికించుకుంటున్నారు. ఈ పరిస్థితుల వల్ల జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు తగ్గి, దీని ప్రభావం వచ్చే ఏడాదిపై పడుతుందని రైతులుఆందోళన చెందుతున్నారు.
     

Advertisement
Advertisement