మైనింగ్ కోసం.. వార్నింగ్ | Sakshi
Sakshi News home page

మైనింగ్ కోసం.. వార్నింగ్

Published Mon, May 11 2015 2:07 AM

మైనింగ్ కోసం.. వార్నింగ్ - Sakshi

మైన్ ఓనర్‌ను బెదిరిస్తున్న ఓ మాజీ మంత్రి
ఫ్యాక్షనిస్టు ద్వారా తీవ్ర వేధింపులు..
రహదారికి అడ్డంగా గోతులు
కమీషన్ ముట్టజెబుతామన్నా ససేమిరా అంటున్న వైనం

 
సాక్షి ప్రతినిధి, కడప : నాలుగు రూకలు పోగవుతాయనుకుంటే చాలు అధికారపార్టీ నేతలు దౌర్జన్యాలకు ఒడిగడుతున్నారు. మైనింగ్‌కు ప్రభుత్వ అనుమతులున్నా అధికారపార్టీ నేతల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. కబ్జాలు...సెటిల్‌మెంట్లతో సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు  సరికొత్తగా మైనింగ్‌పై దృష్టి సారించారు. సౌమ్యుడు, మితభాషి అని చెప్పుకుంటున్న ఓ మాజీ మంత్రి ఏకంగా 112 ఎకరాల మైన్‌ను అప్పగించమని డిమాండ్ చేస్తున్నారు.

అంతవరకూ మైనింగ్ చేయరాదంటూ హుకుం జారీ చేయడమే గాక ఫ్యాక్షనిస్టు అయిన ఓ నేతను ఉసిగొల్పినట్లు సమాచారం. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ పరిధిలో క్వార్జైట్ (సిలికాశాండ్) ఖనిజం ఉంది. సర్వేనంబర్ 425లో 60 ఎకరాలు షేక్ జమాల్‌వలీ అనే వ్యక్తికి క్వార్జైట్ మైనింగ్ కోసం అప్పటి ప్రభుత్వం జీఓ నెంబర్ 330 ద్వారా 2008లో అనుమతి ఇచ్చింది. అప్పట్లో మైనింగ్ చేసిన జమాల్‌వలీ సుమారు 2వేల టన్నులు మైనింగ్ చేశారు.

ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చెల్లింపులు సక్రమంగా నిర్వహించారు. తర్వాత అనారోగ్య కారణాల రీత్యా మైనింగ్ నిర్వహణకు దూరంగా ఉన్నారు. ఈలోగా ఆ ప్రాంతానికి చెందిన కొందరు మైనింగ్ చేపట్టడం ద్వారా ఆదిమానవుడి రేఖాచిత్రాలకు భంగం కల్గనున్నట్లు హైకోర్టులో పిల్ వేశారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న ఆర్కియాలజీ ఎన్‌ఓసీ ఇవ్వడంతో రేఖాచిత్రాలకు వంద అడుగులు వదలి మైనింగ్ చేసుకోవాలని కోర్టు ఉత్తర్వులు సైతం ఇచ్చింది. ఆ తర్వాత మైనింగ్ చేసుకునేందుకు సిద్ధం కాగా స్థానికంగా ఆటంకాలు ఎదురైనట్లు తెలుస్తోంది.

 ఒక్కసారిగా బూమ్ రావడంతో....
  ఇసుక నియంత్రణ అధికం కావడంతో గ్లాస్ ఫ్యాక్టరీ, సిరామిక్ పరిశ్రమలు, వైట్ సిమెంట్ తదితర పరిశ్రమలు సిలికాశాండ్‌పై దృష్టి సారించాయి. దాంతో ఒక్కమారుగా క్వార్జైట్ ఖనిజంకు బూమ్ వచ్చింది. ఒక్కమారుగా కళ్లెదుట ఉన్న మైనింగ్‌పై అధికారపార్టీ నేతల దృష్టి పడింది. ఎలాగైనా మైన్ దక్కించుకోవాలనే దుగ్ధతో మైన్ ఓనర్‌ను ముప్పుతిప్పలు పెట్టడం ప్రారంభించారు. ఇదేమి అన్యాయమని మాట్లాడితే, తన ఫ్యాక్షన్ చరిత్రను వివరిస్తూ బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం.

అసలు కథ తెలియడంతో మైన్ ఓనర్ జమాల్‌వలీ రాయబేరాలు నడిపినట్లు తెలుస్తోంది. చింతకుంట గ్రామ అభివృద్ధికి తనవంతు పాత్ర పోషిస్తానని మీరెమీ చెప్పినా చేసేందుకు ముందుకు వస్తానని వివరించినట్లు సమాచారం. ఇవేవీ అధికార పార్టీకి చెందని ఫాక్షన్‌నేతకు రుచించనట్లు తెలుస్తోంది. కొండకు వెళ్లేందుకు రహదారి వేయాలని గ్రామస్తులు కోరడంతో ఆ పనులు మైనింగ్ ఓనర్ ప్రారంభించారు. అయితే రాత్రికి రాత్రి జేసీబీతో టీడీపీ నేతలు రోడ్డుపై గోతులు తీశారు.

గ్రామస్తుల్లో వ్యతిరేకత వ్యక్తమైనా టీడీపీ నేతలు వెనక్కితగ్గడం లేదు. ఈ తరుణంలో తనకు ఏమైనా ముప్పు కలిగితే అందుకు కారకుడు ఫ్యాక్షన్ నేతేనని మైన్ ఓనర్ కేసు వేసినట్లు సమాచారం. దాంతో అధికారపార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. కేసు ఉపసంహరించుకో, సర్దుబాటు చేస్తానని చెప్పినట్లు సమాచారం.

 112 ఎకరాలున్న మైన్ అప్పగించండి....
 వారంతా ఫ్యాక్షన్‌లో తలమునకలైన వారు, మీకు ముద్దనూరు మండలంలో ఉప్పలూరు, వేల్పుచర్ల, చింతకుంట తదితర గ్రామాల్లో మైనింగ్ లీజులు ఉన్నాయి. సమస్య ఎందుకు, ఒక్కరోజుతో పోయేది కాదు, నేను చెప్పినట్లు వినండి, ఇరువురు సర్దుకుపోండని అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి పల్లవి అందుకున్నట్లు తెలుస్తోంది. చింతకుంట గ్రామంలోనే జమాల్‌వలీ పేరుపై ఉన్న మైన్ మీరే చేసుకోండి, అదే గ్రామంలో సర్వే నంబర్ 425లో 112 ఎకరాలు షేక్ అల్లా మహమ్మద్ బక్ష్ పేరుతో లీజు ఉన్న మైన్‌కూడా అప్పగించ మని తీర్పు చెప్పినట్లు తెలుస్తోంది.

మండల వ్యాప్తంగా మీకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తాం ఇరువురికి ఇబ్బందులు ఉండవని సెలవిచ్చినట్లు సమాచారం. తాము మైన్ కోసం తీవ్రంగా కష్టపడ్డాం, మైన్ ఇవ్వలేం, టన్నుకింత కమీషన్ ఇవ్వగలం, మైనింగ్ చేసే కొద్ది మీకు ఆదాయం లభిస్తుందని వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.

అయినప్పటికీ అధికార పార్టీ నేతలు తాము కోరిన 112 ఎకరాలు అప్పగిస్తే సరీ, లేదంటే పనులు ఎలా చేస్తారో...చూస్తాం అంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్ చరిత్ర కల్గిన నాయకులు కావడం, మాజీ మంత్రి అండదండలు ఉండడంతో దిక్కుతోచని స్థితిలో మైన్ ఓనర్ ఉన్నట్లు తెలుస్తోంది. మైనార్టీ ప్రతినిధులతో కలిసి  ముఖ్యమంత్రిని కలిసి అధికార పార్టీ నాయకుల ఆగడాలను వివరించేందుకు మైన్ ఓనర్ సన్నద్ధమైనట్లు సమాచారం.

Advertisement
Advertisement