మంత్రి అనుచరుల్లో ఆధిపత్యపోరు | Sakshi
Sakshi News home page

మంత్రి అనుచరుల్లో ఆధిపత్యపోరు

Published Wed, Nov 20 2013 4:18 AM

Minister followers fired with non local peoples

గోదావరిఖని, న్యూస్‌లైన్ : మంత్రి శ్రీధర్‌బాబు అనుచరుల ఆధిపత్యపోరు స్థానిక స్వర్ణకారులు, బెంగాలీ స్వర్ణకారుల మధ్య చిచ్చు పెట్టింది. బెంగాలీ నుంచి వచ్చిన స్వర్ణకారుల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని, వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానిక స్వర్ణకారులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అనుచరుల్లో ఒకరు బెంగాలీలకు, మరొకరు స్థానిక స్వర్ణకారులకు నాయకత్వం వహిస్తున్నారు. బెంగాలీలకు మద్దతుగా నిలిచిన నేతలకు పెద్దమొత్తంలో డబ్బులు అందినట్లు ఖనిలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక స్వర్ణకారులు బుధవారం గోదావరిఖనిలో దుకాణాలు బంద్ చేసి సమావేశమవుతున్నారు. బెంగాలీ స్వర్ణకారులు ఇప్పటికే రెండు రోజులుగా తమ దుకాణాలు మూసి ఉంచుతున్నారు.
 
 గోదావరిఖని పట్టణంలో 45 బంగారం, వెండి వర్తక దుకాణాలుండగా... నగలను హైదరాబాద్, బెంగళూర్, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించేవారు. సమయం, దూరాభారం, భద్రతా భయాలను ఆలోచించిన ఓ వ్యాపారి 22 ఏళ్ల కిత్రం పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరు పనివారిని తీసుకువచ్చి స్థానికంగా నగలు తయారు చేయిం చడం మొదలుపెట్టాడు. కాలక్రమంలో వీరి ద్వారా పశ్చిమబెంగాల్‌లోని హుబ్లీ, మెంతినిపూర్ తదితర జిల్లాలకు చెంది న చాలా మంది నగల తయారీకి గోదావరిఖని వచ్చారు. ప్రస్తుతం వారు 200 మంది వరకు ఉన్నారు. పనితనం బాగుండడంతోపాటు సమయానికి నగలు చేసి ఇస్తుండడంతో స్థానిక వర్తకులే కాకుండా కరీంనగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథని తదితర ప్రాంతాల వ్యాపారులు కూడా వీరికి ఆర్డర్లు ఇస్తున్నారు. స్థానిక స్వర్ణకారుల పిల్లలు చదువుపై దృష్టి పెట్టడంతో వృత్తిని భర్తీ చేసేవారు కరువయ్యారు. కొందరు ఉన్నా... పాత పద్ధతుల్లోనే నగలు తయారు చేస్తుండడంతో బెంగాలీవారికే ఆర్డర్లు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో స్థానిక స్వర్ణకారులకు, బెంగాలీ పనివారికి మధ్య అంతర్యుద్దం మొదలై ఎనిమిదేళ్ల క్రితం బెంగాలీలను కిడ్నాప్ చేసే వరకు వెళ్లింది.
 
 ఇప్పుడేం జరుగుతోంది?
 స్థానిక స్వర్ణకారుల సంఘానికి మంత్రి అనుచరుడైన ఓ నాయకుడు నాయకత్వం వహిస్తే... బెంగాలీ పనివారికి మరో అనుచరుడు అండగా నిలిచాడు. ఈ తరుణంలో బెంగాలీలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కొద్ది రోజుల క్రితం స్థానిక స్వర్ణకారులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వివిధ పార్టీల మద్దతు కూడగట్టారు. కొంత మంది బెంగాలీలను పంపించేందుకు జాబితా తయారు చేశారు.
 
 బెంగాలీలకు అండగా నిలిచిన నాయకుడు మరో నేతతో కలిసి దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుందని చెప్పడంతో బెంగాలీలను పంపించే కార్యక్రమం నిలిచిపోయింది. ఇందుకుగాను బెంగాలీలు సదరు నాయకులకు పెద్ద మొత్తంలో ‘నజరానా’ ముట్టజెప్పినట్టు ప్రచారం జోరందుకుంది. ఆధిపత్యం చెలాయించేందుకు ఈ ఇద్దరు నాయకులు తమ ప్రతాపాన్ని స్థానిక స్వర్ణకారులు, బెంగాలీ పనివారిపై చూపిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. స్వర్ణకారుల్లో చిచ్చుపెట్టి నేతలు లబ్ధిపొందుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement
Advertisement