మామూళ్ల వివరాలివ్వండి: ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

మామూళ్ల వివరాలివ్వండి: ఎమ్మెల్యే

Published Thu, Aug 10 2017 8:58 AM

మామూళ్ల వివరాలివ్వండి: ఎమ్మెల్యే

వక్ఫ్‌బోర్డు అధికారులను బెదిరించిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌

సాక్షి, అమరావతి: వక్ఫ్‌బోర్డుకు కాబోయే చైర్మన్‌ను నేనే.. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకు ఎంత మామూళ్లు ఇచ్చారు.. ఆదాయం, ఖర్చు వివరాలు చెప్పండి అంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ వక్ఫ్‌బోర్డు అధికారులను బెదిరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో తాను సూచించిన వారిని ముతవల్లీలుగా గెలిపించాలని, లేకుంటే అందుకు సహకరించని అధికారులను సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. వక్ఫ్‌బోర్డుకు ఎలాంటి సంబంధంలేని ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడటం ఏమిటని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతోనే తేల్చుకుంటామని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ల సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి హాజరవుతానని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వక్ఫ్‌బోర్డు అధికారులకు ముందుగా సమాచారం ఇచ్చారు. అయితే వక్ఫ్‌బోర్డులో ఏ హోదా లేకుండా సమావేశానికి హాజరవడానికి వీలులేదని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. అయితే ఎమ్మెల్యే భోజనాలు ఏర్పాటు చేయడంతో ఇన్‌స్పెక్టర్లతోపాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ బెదిరింపులకు దిగడంతో అధికారులు ఖంగుతిన్నారు. అంతేకాకుండా కర్నూలు, విజయవాడలకు చెందిన ఖాజా, ఇంతియాజ్‌ అనే వ్యక్తులను పరిచయం చేస్తూ ఆయా ప్రాంతాల్లో వీరు ముతవల్లీలుగా పోటీ చేయనున్నారని, వీరిని గెలిపించే బాధ్యత మీదే అంటూ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులకు సూచించారు. అందుకు సహకరించని వారిని సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా వక్ఫ్‌బోర్డులో ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ముతవల్లీలు, ఒక న్యాయవాది ఇతరులను సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ లేకపోవడంతో వైఎస్సార్‌ సీపీ నుంచి వలసలు వచ్చిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు వక్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకుండా నాన్చుతూ వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement