2024 నాటికి వినికిడి దృష్టి లోపాలుండవు | Sakshi
Sakshi News home page

2024 నాటికి వినికిడి దృష్టి లోపాలుండవు

Published Mon, Feb 24 2020 1:18 PM

MLA Rachamallu Siva Prasad Reddy Distribute SHAHI Company Ear Machine - Sakshi

ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా 2024 నాటికి రాష్ట్రంలో వినికిడి, దృష్టి లోపాలు ఉన్నవారు కనిపించరని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. విర్చోస్, వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం సాహి నేతృత్వంలో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వాగ్దేవి ఇంజినీరింగ్‌కళాశాలలో చెవిలో నొప్పి, వినికిడి సమస్య, చీము కారడం లాంటి సమస్యలకు వైద్యులు పరీక్ష చేసి చికిత్స చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి తల్లిదండ్రులు పిల్లలను శిబిరానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యకంటే జ్ఞానం గొప్పదని, జ్ఞానం కంటే మానవత్వం గొప్పదని, ఆ మానవత్వానికి నిలువెత్తు రూపమే సాహి సంస్థ అని తెలిపారు. మానవీయ కోణంలో తన కుటుంబాన్నే కాకుండా పేదరికంలో ఉన్న అందరి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలనే నిస్వార్థ ఆలోచనతో సంస్థ వ్యవస్థాపకులు సజ్జల దివాకర్‌రెడ్డి అందిస్తున్న సేవలు గొప్పవని పేర్కొన్నారు.

రాజకీయ నాయకులు సేవ చేసి ఓటును ఆశిస్తారన్నారు. అయితే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రూ.కోట్లు పెట్టడంతోపాటు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తుండటం గొప్ప విషయమన్నారు. ఎంతో మంది ధనవంతులు ఉన్నారని, అలాంటి వారు సామాజిక సేవకు ముందుకు రావడం లేదన్నారు. వారందరూ ఈ దిశగా ఆలోచించాలని కోరారు.ఆకలితో పోరాటం చేసే పేదలు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేసుకోవాలంటే సాధ్యం కాదన్నారు. ఈ ఆపరేషన్‌ చేసుకోవడానికి ఒక చెవికి రూ.6లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఇలాంటి వారికి సాహి సంస్థ ముందుకు వచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం గొప్ప విషయమని చెప్పారు. సజ్జల దివాకర్‌రెడ్డి మా కుటుంబానికి ఆత్మ బంధువు అని అన్నారు. దాతృత్వానికి పేరెన్నికగన్నారని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ప్రధానంగా నలుగురు కారణమన్నారు. తనకు టికెట్‌ ఇచ్చి ఎంతో అభిమానంతో తనను ప్రోత్సహించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకరైతే, మానసికంగా తనను వెన్నుతట్టి ప్రోత్సహించి అన్ని విధాలా సహాయం అందించిన మా అన్న కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో వారన్నారు. తనను ఆదరించి ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గ ప్రజలు మూడో వారని, కౌన్సిలర్‌ స్థాయి నుంచి తన వెనకుండి ప్రోత్సహించిన సజ్జల దివాకర్‌రెడ్డి నాలుగోవారని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సాన్నిహిత్యం పెరగడానికి కూడా ఆయన కారణమని పేర్కొన్నారు. 

రాజన్న మానస పుత్రిక ఆరోగ్యశ్రీ– జగనన్న మానస పుత్రిక అమ్మ ఒడి  
ప్రాణానికి ప్రాధాన్యత ఇచ్చి అందరూ ఆరోగ్యంతో జీవించాలని నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. ప్రపంచంలోనే ఎవరికి రాని ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అకాల మరణం పొందారన్నారు. ఈ కారణంగానే నేటికీ అందరి మనస్సుల్లో రాజశేఖరరెడ్డి అమరుడుగా ఉన్నారని చెప్పారు. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరక్షరాస్యత లేకుండా ఉండేందుకుగాను అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాల ద్వారా ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులను చేస్తే తద్వారా వారి కుటుంబాలు బాగుపడుతాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సాహి (సొసైటీ టు ఎయిడ్‌ ది హియరింగ్‌ ఇంపైర్డ్‌) సంస్థ వ్యవస్థాపకుడు సజ్జల దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కుటుంబాల వారు వినికిడిలోపం సమస్యతో బాధపడుతున్నారన్నారు. వారికి అవగాహన కల్పించి, చికిత్స చేసేందుకు చాలా క్యాంప్‌లను నిర్వహించామని పేర్కొన్నారు. సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే ఉపయోగం ఉంటుందని, వయసు పెరిగే కొద్ది సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్నారు.

వినికిడి లోపం సమస్యతో ఎవరు కుటుంబానికి, సమాజానికి భారం కాకూడదనే లక్ష్యంతో సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ఎంతో మంది వినికిడి లోపం ఉన్న వారు ఆపరేషన్‌ చేయించుకుని ఉన్నత ఉద్యోగాలు పొందారని, క్రీడల్లో రాణిస్తున్నారని వివరించారు. 16 ఏళ్లుగా ఇలాంటి సేవలు అందిస్తున్నామని, ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మెటర్నిటి ఆస్పత్రుల్లోనే ఆడియాలజిస్టును ఏర్పాటు చేసి వెంటనే జబ్బును గుర్తించేందుకు వీలుగా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రిమ్స్‌లాంటి ఆస్పత్రుల్లో ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఇప్పటికే ఈ సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆయన సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకునే అవకాశ ఉందని తెలిపారు.కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాని పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చక్రయపేట మండల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డి, వాగ్దేవి ఇంజినీరింగ్‌ కాలేజి కరస్పాండెంట్‌ జి.హుసేన్‌రెడ్డి, డైరెక్టర్‌ పీఆర్‌ బాబాజీ, ప్రిన్సిపాల్‌ జి.జగదీశ్వరరెడ్డి, డిజెబుల్‌ వెల్ఫేర్‌ జిల్లా ఏపీఓ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.   

70 మందికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు
ప్రొద్దుటూరు : విర్చోస్, వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాల, వైఎస్‌ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాహి నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం 70 మందికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు చేయించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు నిర్ధారించినట్లు చక్రాయపేట మండల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డి తెలిపారు. సాయంత్రం 36 మందికి అవసరమైన వినికిడి యంత్రాలను వైఎస్‌ కొండారెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఒక్కో వినికిడి యంత్రం దాదాపు రూ.10వేలు అవుతుందని తెలిపారు. వైద్య శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 348 మంది వచ్చారన్నారు. వీరిలో 70 మందికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు అవసరమని వైద్యులు చెప్పారన్నారు. రెండు మూడు నెలల్లో దశల వారిగా వీరందరిని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. రెండు రోజులు అక్కడే ఉండేందుకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ఆపరేషన్లు అనంతరం వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత కూడా తమదేనని చెప్పారు. అనంతరం సాహి వైద్య బృందాన్ని, వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను వైఎస్‌ కొండారెడ్డి అభినందించారు. పేదలకు మంచి సేవ చేశారని కొనియాడారు. కార్యక్రమంలో వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ జి.హుసేన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ జి.జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement