రూ. అరకోటికి గండి | Sakshi
Sakshi News home page

రూ. అరకోటికి గండి

Published Fri, Sep 26 2014 2:09 AM

modern works in repalley

రేపల్లె: రేపల్లెలోని న్యూకోర్సు మురుగుకాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో భారీగా మట్టి వచ్చింది. మొదటివిడతలో వచ్చిన మట్టిని టెండర్ల ద్వారా అధికారులు విక్రయించారు. ఇళ్ల వద్ద, పొలాల్లో మెరక పోసుకునేందుకు ఈ మట్టి బాగా ఉపయోగకరం కావడంతో సహజంగానే డిమాండ్ ఏర్పడింది. దీంతో రెండో విడత వచ్చిన మట్టిని గుట్టుచప్పుడు కాకుండా పాత టెండర్‌దారులే అమ్మేసుకున్నారు. దీనికి అధికారులు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించారు.
 
ఇదీ జరిగింది...
రేపల్లె ప్రధాన మురుగుకాలువగా ఉన్న న్యూకోర్సు అధునీకరణ పనులను 2012-13లో సుమారు రూ.10 కోట్లతో ప్రారంభించారు.
నగరం మండలంలోని 16.200 కిలోమీటర్ నుంచి 8.800 కిలోమీటర్ వరకు కాలువ తవ్వకాలు చేపట్టారు.
పలు ప్రాంతాల్లో కాలువను మూడు విడతలుగా తవ్వాల్సి వచ్చింది.
కాలువలో మొదటి విడత పూడిక తీయగా వచ్చిన మట్టిని విక్రయించేందు కు 12 రీచ్(ప్రతి 500 మీటర్లకు ఒక రీచ్)లుగా విభజించి, 2013 జూన్‌లో టెండర్లు పిలిచారు.
మట్టి విలువను రూ.27.6 లక్షలుగా నిర్ణయించగా, టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు రూ.35 లక్షలకు దక్కించుకున్నారు.
ఈ విధంగా కాంట్రాక్టర్లు మట్టిని అమ్ముకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
 యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
కాలువ 13.700 కిలోమీటర్‌నుంచి 12.500 మధ్య వంతెన ఉంది. ఇక్కడ టెండర్లు పిలవకుండానే మట్టిని కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కై అమ్ముకున్నారు. మట్టి తరలింపుతో వంతెనకు తీవ్ర నష్టం కలుగుతుందని గ్రామస్తులు అడ్డుకున్నా పట్టించుకోలేదు.
కాలువ కట్టల లెవలింగ్ పేరుతో రెండో విడత తవ్వకాలు చేపట్టారు. మళ్లీ భారీగా మట్టి వచ్చింది.
టెండర్లు లేకుండా  మట్టిని గుట్టుచప్పుడు కాకుండా అధికారులు పాతటెండర్‌దారులతో కుమ్మక్కై అమ్ముకున్నారు.
దీంతో డ్రైనేజీ శాఖకు దాదాపు రూ. అర కోటి వరకు నష్టం వాటిల్లింది.
  5, 6 రీచ్‌ల్లో మట్టిని తరలించకుండా నిబంధనల పేరిట అధికారులు నిలుపుదల చేశారు. తిరిగి ఇక్కడ రెండో విడత తవ్వకాల్లో వచ్చిన మట్టి నిల్వలపై ఇప్పుడు అధికార పార్టీ నాయకుల కన్ను పడింది.
డ్రైనేజీ అధికారుల అనుమతులు లేకున్నా మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
 అధికారుల భిన్న వాదనలు ...
దీనిపై డ్రైనేజీ శాఖ ఈఈ ఏసయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా ప్రజోపయోగానికి మట్టి తరలించుకునేలా అనుమతులు ఇచ్చామని చెప్పారు. టెండర్లు లేకుండా మట్టి తరలిస్తే ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది కదా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు.
డ్రైనేజీ డీఈ జోజయ్య మాత్రం గత నెలలో టెండర్లు పిలిచామని చెప్పారు.  మట్టి తరలింపునకు గ్రామ సర్పంచ్‌కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఎంతకు టెండర్ సొంతం చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. ఇదిలావుండగా, న్యూకోర్సు మురుగు కాలువ తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement