రాజధానిపై అయోమయం | Sakshi
Sakshi News home page

రాజధానిపై అయోమయం

Published Mon, Jul 14 2014 3:26 AM

రాజధానిపై అయోమయం - Sakshi

* కొత్త ప్రాంతాల అన్వేషణలో సర్కారు
* ప్రభుత్వ భూములున్న ప్రాంతాల పరిశీలన
* ఏర్పేడు-వెంకటగిరి మధ్య 40 వేల ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి
* తిరుపతి విమానాశ్రయం, జాతీయ రహదారి, కృష్ణపట్నం, దుగరాజపట్నం పోర్టులకు సులువుగా రవాణా
* పూర్తి స్థాయి సర్వే జరపాలంటూ చిత్తూరు, నెల్లూరు జిల్లాల రెవెన్యూ అధికారులకు సర్కారు ఆదేశం
* దొనకొండలో 40 వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి

 
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందన్న ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉంటుందంటూ వ్యూహాత్మకంగా తెలుగుదేశం నేతలు చేసిన ప్రచారానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సృష్టిస్తున్న హడావుడితో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో కొత్త రాజధానికి భూ సేకరణ అతిపెద్ద సవాలుగా మారనుంది. దీనికితోడు రాజధానికి చాలినన్ని భూముల లభ్యతపైనా సందేహాలు అలుముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ భూములెక్కడున్నాయి? అలా ప్రభుత్వ భూములున్న ప్రాంతాల్లో రాజధానికి అనువైన ప్రాంతాలేవీ? వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో అధికారులు ఎక్కడికక్కడ వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. తాజాగా అధికారులు అందిస్తున్న నివేదికలతో ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దులోని వెంకటగిరి తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు-నెల్లూరు జిల్లా వెంకటగిరి మధ్య సుమారు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, 30 వేల ఎకరాలదాకా అటవీ భూమి ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే ఎకరం భూమి కూడా కొనాల్సిన పని ఉండదని సీఎంకు నివేదించారు. వెంకటగిరికి 3 కి.మీ. దూరంలోనే తెలుగుగంగ కాలువ ఉండగా.. 30 కి.మీ. దూరంలో కండలేరు రిజర్వాయరు ఉన్నందున సులువుగా నీటిని సరఫరా చేయవచ్చని సూచించారు. వరదముప్పు కూడా లేనందున పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎంత భూమి అందుబాటులో ఉందో తేల్చాలంటూ ప్రభుత్వం చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు సమాచారం. వెంకటగిరి నుంచి 30 కిలోమీటర్లలోపే రేణిగుంట విమానాశ్రయముంది. రెండున్నర గంటల్లో చెన్నయ్ విమానాశ్రయానికి చేరుకునే వీలుంది. గంట వ్యవధిలోనే కృష్ణపట్నంతోపాటు ప్రతిపాదిత దుగరాజపట్నం పోర్టుకు చేరుకునే వీలుంది. వెంకటగిరి నుంచి 39 కిలోమీటర్ల దూరం నాలుగులేన్ల రహదారి నిర్మించుకుంటే నాయుడుపేట వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానించే వీలుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
 
 దొనకొండపైనా నివేదిక..
 ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో 40 వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ, అటవీ భూమి ఉన్నట్లు లెక్కతేల్చిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ప్రాంతంలోని అటవీ భూమిని డీ నోటిఫై చేయిస్తే రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందనే సూచనలు సర్కారుకు అందాయి. దొనకొండకు సమీపంలోనే సాగర్ కెనాల్, వెలిగొండ రిజర్వాయర్లు ఉండటంతో ఇక్కడి నుంచి నీటిని తరలించుకోవచ్చని ప్రతిపాదించారు. పైగా ఇక్కడున్న పురాతన విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించుకునే అవకాశాలూ ఉన్నాయని నివేదించారు.
 
 కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకేచోట ప్రభుత్వ భూముల్లేవు...
 కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు జరిపించిన సర్వేలో నిడిముక్కల, మోతడక, కర్లపూడి, పెదమద్దూరు, తాడేపల్లి, కొండవీడు ప్రాంతాల్లో 16,935.7 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి(వీజీటీఎం) అభివృద్ధి సంస్థ పరిధిలో 5,178.75 ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్ భూములున్నట్లు గుర్తించారు. అయితే ఇందులో ఎక్కడా నాలుగైదు వేల ఎకరాల భూమి ఒకేచోట లేదు. కాగా ఉడా భూమిలో తాడికొండ వద్ద గల లాంఫారమ్‌లోని 534 ఎకరాలను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదించారు. 676 ఎకరాలు తాడికొండ చెరువుగా పేర్కొన్నారు. దీనినిబట్టి ఈ ప్రాంతంలో అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యే నివాసగృహాలు, ఐఏఎస్‌ల నివాసగృహాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకోసం తప్పనిసరిగా రైతులనుంచి భూమి కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. గుంటూరు జిల్లా అమరావతి పరిసర ప్రాంతాల్లో 10,292 ఎకరాల అటవీ భూమి ఉన్నా ఈ ప్రాంతం వరద తాకిడికి గురవుతూ ఉండటంతో ఇక్కడ రాజధాని నిర్మాణం క్షేమం కాదన్న భావన వ్యక్తమైంది.
 
 మరోవైపు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మార్గంలో సుమారు 14 వేల ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములను గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో కాలుష్య కారక కర్మాగారాలున్నందున రాజధాని నిర్మాణానికి తగదని అధికారులే అభిప్రాయపడ్డారు. దీనికితోడు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉంటుందంటూ సీఎం చంద్రబాబుతోసహా టీడీపీ నేతలు చేసిన ప్రచారంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు భూసేకరణ సవాలుగా మారింది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేయనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌కు స్థలాలను ఇక్కడే గుర్తించినందున రాజధాని ఈ ప్రాంతంలో ఉండబోదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా అందుతున్న సమాచారంతో ఇప్పటికే ఇక్కడి భూముల ధరలు పెంచేసి అగ్రిమెంట్లు చేసుకుంటూ కృత్రిమ మార్కెట్‌ను సృష్టించిన వ్యాపారులు తాము కొనుగోలు చేసిన భూముల అమ్మకాలపై దృష్టి సారించారు.

Advertisement
Advertisement