నేలతల్లితో బంధం తెగుతోంది | Sakshi
Sakshi News home page

నేలతల్లితో బంధం తెగుతోంది

Published Fri, Oct 18 2013 12:48 AM

నేలతల్లితో బంధం తెగుతోంది - Sakshi

సాక్షి, హైదరాబాద్: దేశానికి తిండిపెట్టే రైతన్నలకు భూమాతతో అనుబంధం తెగిపోతోంది. రాష్ట్రంలో సాగు క్షీణించి, వ్యవసాయ ఆధారిత పల్లెల సంఖ్య తగ్గుతోంది. సాగుభూములు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. పెరుగుతున్న అప్పులు, ఎరువుల ధరలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవ డం.. వెరసి రైతు బతుకు ఛిద్రమవుతోంది. ఆదాయ పన్ను శాఖ(ఐటీ)కు ఈ ఏడాది అందిన రిటర్నులు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం.. సాగు భూముల ఆదాయంపై పన్ను రాయితీ ఉన్న నేపథ్యంలో ఎన్నారైలతోపాటు, బడా వ్యాపార సంస్థలు ఈ భూములను భారీస్థాయిలో కొంటున్నాయి.  ఈ ఏడాది కొనుగోళ్లు జరిగిన భూముల్లో 30% మేర కార్పొరేట్ సంస్థలు కొన్నాయి.   
 
 రుణ బాధలే దూరం చేస్తున్నాయా?: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులు, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రైతులకు సాగు గిట్టుబాటు కావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. గత పదేళ్లలో 45% మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుం బాలున్నాయి. వీటిలోని 60 లక్షల మందికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. గత నాలుగేళ్లుగా పెట్టుబడులు పెరగడం, అధిక వడ్డీలకు రుణాలతో 49.49 లక్షల మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వీరిలో చాలామంది  తమ చిన్న కమతాలు అమ్ముకుని పట్టణాలకు వలసపోయారు. గతంలో భూమి అమ్మితే స్థానిక గ్రామస్తులే కొనేవారు. మూడేళ్ల భూలావాదేవీల ప్రకారం 520 మంది స్థానికేతరులు వివిధ ప్రాంతాల్లో పొలాలు కొన్నారు. వీరు ఏకంగా 50 నుంచి 100 ఎకరాలు కొనడం విశేషం.  
 
 పల్లెకు గ్రహణం
 ైరె తులు వ్యవసాయాధారిత రంగాలనూ విడిచిపెడుతున్నారు. పశుపోషణ, కోళ్ల పెంపకం వంటివి మానేసిన రైతులు రాష్ట్రంలో గత రెండేళ్లలో 12 లక్షల మంది ఉన్నారు. వలసల వల్ల పల్లెల్లో జనాభా పెరుగుదల భారీగా పడిపోతోంది. 2001లో రాష్ట్ర పట్టణాల్లో 27.30 శాతం మంది నివసిస్తుంటే, 2011 నాటికి ఆ సంఖ్య  33.49 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్లుగా జనాభా పెరుగుదల 1.64 శాతంగానే నమోదైంది.
 
  హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న రంగారెడ్డి(92.19 శాతం), మెదక్(89.19 శాతం) జిల్లాలతోపాటు వైఎస్‌ఆర్ జిల్లాలో(67.37 శాతం) పట్టణ జనాభా పెరుగుదల శాతం ఎక్కువగా ఉంది. పల్లె  జనాభా బాగా తగ్గుతున్న జిల్లాల్లో కృష్ణా(6.07 శాతం) తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కడప(8.62 శాతం) రంగారెడ్డి(3.98 శాతం) ఉన్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో గత పదేళ్లలో వ్యవసాయ గ్రామాల సంఖ్య బాగా తగ్గింది. 2001లో ఇవి 28,123 ఉండగా, 2011లో  27,800కి పడిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పడిపోతాయని నిపుణులు అంటున్నారు.
 
 సెన్సస్ టౌన్ల పెరుగుదల         
 రాష్ట్రంలో ‘జనాభా లెక్కల పట్టణాలు’(సెన్సస్ టౌన్లు) మూడు రెట్లు పెరిగాయి. 5 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలను సెన్సస్ టౌన్లుగా కేంద్రం వర్గీకరించింది. వీటిలో చదరపు కిలోమీటరుకు 400 మంది ఉండాలి. వీరిలో 75 శాతం మంది వ్యవసాయేతర వృత్తుల్లో జీవనోపాధి పొందుతుండాలి. మన రాష్ట్రంలో ఇలాంటి పంచాయతీలు 2001లో 90 ఉంటే, 2011 నాటికి వాటి సంఖ్య 228కి పెరిగింది. మరోపక్క.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలు 2001లో 117 ఉంటే, 2011 నాటికి 125కు పెరిగాయి. అంటే ఈ ప్రాంతాల శివారు పల్లెలోనూ వ్యవసాయం 75 శాతం పడిపోయినట్టే. పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి, పట్టణాలకు దూరంగా ఉన్న సాగుభూములు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో పట్టణ శివార్లలోని 60 శాతం భూములు కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు, వారి బంధువులు కొన్నారు.

Advertisement
Advertisement