క్రిమినల్ సునీల్ దొరికాడు.. | Sakshi
Sakshi News home page

క్రిమినల్ సునీల్ దొరికాడు..

Published Tue, Dec 16 2014 3:14 AM

క్రిమినల్ సునీల్ దొరికాడు.. - Sakshi

అనంతపురం, కృష్ణా జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్
అనంతపురం క్రైం : పోలీసుల కళ్లుగప్పి పరారైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ ఎట్టకేలకు కృష్ణా జిల్లాలో పట్టుబడ్డాడు. ఇతను వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాల్లో పలు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడు. బలవంతపు వసూళ్ల గ్యాంగ్ లీడరైన ఇతని స్వస్థలం వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు. ఇంజినీరింగ్ విద్యార్థులను చేరదీసి భారీగా డబ్బు ఆశ చూపి అనుచరులుగా మార్చుకునే వాడు.

సుమారు 170 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఇతని అనుచరులుగా ఉన్నారు. డబ్బున్న వారిని కిడ్నాప్ చేసి సొమ్ము రాబట్టడం ఇతని ప్రధాన వ్యాపకం. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్‌ను గతంలో అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కడప సబ్‌జైలులో రిమాండ్‌లో ఉంటున్నాడు. ఓ కేసు విషయమై సునీల్‌ను ఈనెల 11న అనంతపురం ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్, వెంకటరమణారెడ్డి అనంతపురం కోర్టుకు తీసుకొచ్చారు. తిరిగి కడప జైలుకు తీసుకెళ్తుండగా పరారయ్యూడు.

ఇంతటి కీలకమైన నిందితుడి విషయంలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. తప్పించుకున్నాడా.. లేక సెక్యూరిటీ సిబ్బందే తప్పించారా.. అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సునీల్ పారిపోవడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ముమ్మర వేట ప్రారంభించారు.

సునీల్ కదలికలు కృష్ణా జిల్లాలో ఉన్నట్లు సమాచారం రావడంతో అనంతపురం ఎస్పీ రాజశేఖర్‌బాబు, కృష్ణా ఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంయుక్తంగా సుమారు 20 బృందాలను నియమించి జల్లెడ పట్టించారు.  కృష్ణా జిల్లాలో సోమవారం పట్టుబడగా రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. తప్పించుకున్నప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరిగాడు.. మరేదైన ఘటనకు పాల్పడ్డాడా.. అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.  
 
ఇదీ అతగాడి నేర చరిత్ర
మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ నేర చరిత్ర తలుచుకుంటేనే భయం వేస్తుంది. పాశ్చాత్య దేశాల అలవాట్లను రోజురోజుకు వంటబట్టించుకుంటున్న చాలా మంది విద్యార్థులు ఆశించిన స్థాయిలోడబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సునీల్ సరిగ్గా ఇలాంటి వారిని గుర్తించి వల వేశాడు. తనతో పాటు నేరాల్లో పాలుపంచుకునేలా చేశాడు. జల్సాలకు అలవాటు పడ్డ విద్యార్థులు తమ జీవితాలు నాశనమవుతున్నాయని, తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశల సౌధాన్ని కుప్పకూల్చుతున్నామనే కనీస ఆలోచన లేకుండా సునీల్ వలలో పడ్డారు.

చివరకు ఊచలు లెక్కపెడుతున్నారు. భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు సునీల్ ముఠాలో సభ్యులుగా ఉండడం కలవర పెడుతున్న అంశం. ఈ గ్యాంగ్ డబ్బు కోసం పలు కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లు, ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడింది. సునీల్ తండ్రి మండ్ల వెంకటరమణ 2011కు ముందు పులివెందులలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. డిగ్రీ వరకు చదువుకున్న సునీల్ తండ్రి వ్యాపార కార్యకలాపాలకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. అనతి కాలంలోనే బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరప్రవృత్తికి తెర తీశాడు.
 
ఎర్రచందనం అక్రమ రవాణాతో మొదలై...
కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో 2011లో ఎర్రచందనం అక్రమ రవాణాతో ఇతని నేరచరిత్ర ప్రారంభమైంది. తర్వాత కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లకు ఒడిగట్టాడు. 2013లో తాడిపత్రి పట్టణానికి చెందిన మెడికల్ షాపు యజమానిని తన ముఠాతో కలిసి కిడ్నాప్ చేశాడు. డబ్బు ఇవ్వలేదనే కారణంతో అతడిని కర్నూలు జిల్లా జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు.

వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఒక హత్యాయత్నం, ఐదు కిడ్నాప్ కేసులు, రాజంపేటలో ఒక కిడ్నాప్ కేసు, సింహాద్రిపురంలో ఆయుధాలు కల్గి ఉన్న కేసు, మైదుకూరులో బెదిరింపులు, బలవంతపు వసూళ్లు కేసు, అనంతపురం జిల్లా కదిరి, నార్పల పోలీస్‌స్టేషన్లలో రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.

సునీల్‌తో పాటు మరో నలుగురు సభ్యులను ఈ ఏడాది ఆగస్టు 11న అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న అతడిపై పీడీ యాక్టు నమోదుకు పోలీసులు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. కాగా, ఇతడి అనుచర గణం కదలికలపై కూడా తాజాగా పోలీసులు దృష్టి సారించారు.

Advertisement
Advertisement