వివాహేతర సంబంధాల వల్లే..

21 Sep, 2019 11:24 IST|Sakshi
బొబ్బిలిలో కాలువలో మగ శిశువు

చెత్త కుప్పల్లో శిశువులు

వదిలించుకుంటున్న తల్లులు

కుక్కలకు ఆహారమౌతున్న పసికందులు

-ఈ ఏడాది జూలై నెల 31న విజయనగరం ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలోని పొలంలో ఒక రోజు వయసున్న మగశిశువును అట్టపెట్టెలో పెట్టి పడేశారు. దీంతో ఆ శిశువు మృతి చెందాడు.
-ఈఏడాది ఆగస్టు 30న గజపతినగరం రోడ్డులో రెండ్రోజుల వయసున్న మగ శిశువును పడేశారు. దీంతో మగశిశువు మృతి చెందాడు. 
-బొబ్బిలిలో సెప్టెంబర్‌ నెలలో అప్పుడే పుట్టిన శిశువును కాలువలో పడేయడంతో మృతి చెందాడు. 
-తాజాగా విజయనగరం జొన్న గుడ్డి ఉప్పరవీ«ధిలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో పడేయడంతో తలను కుక్కలు తినేశాయి. 
-ఇవే కాదు.. వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో శిశువులను చెత్తకుప్పలు, రోడ్డు పాల్జేసిన సంఘటనలు మూడు బయట పడ్డాయి.          

సాక్షి, విజయనగరం ఫోర్ట్‌: మాతృత్వానికి నోచుకోక ఎంతో మంది మహిళలు అల్లాడుతున్నారు. అలాంటిది చందమామలాంటి పిల్లలను కొందరు నిర్థాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నవమాసాలు గర్భంలో ఉన్న శిశువులు కళ్లు తెరవకముందే హత్య చేసేస్తున్నారు. కొందరు శిశువులను చెత్తకుండీలు, తుప్పల్లో పడేస్తున్నారు. మరి కొందరు ఆలయాలు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లలో వదిలేస్తున్నారు. ఎవరైనా చూస్తే వారు బతికి బట్టగడుతున్నారు. లేదంటే వారు కుక్కలు, నక్కలు పాలై మృత్యువాత పడుతున్నారు. అందరూ ఉన్నప్పటికీ అమ్మ, నాన్న పిలుపునకు నోచుకోక అనాథలుగా మిగులుతున్నారు. 

వివాహేతర సంబంధాల వల్లే..  
వివాహేతర సంబంధాల వల్ల గర్భం దాల్చినవారు విషయం బయటపడితే పరువు పోతుందని భయపడి చెత్తకుప్పలు, బావుల్లోనూ పడేస్తున్నట్టు సమాచారం. వివాహం కాకుండా గర్భవతులు అయిన మహిళలు శిశువులను వదిలించుకోవడానికి విక్రయించడం లేదా శిశువులను తుప్పలు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. 

శిశుగృహకు అప్పగించండి
పిల్లలు అవసరం లేదనుకునే వారు శిశుగృహకు అప్పగించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. శిశువులకు అన్ని రకాల వసతి రక్షణ కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాం. శిశువులను చెత్తకుప్పల పాల్జేయడం మంచిది కాదు.
– బి.హెచ్‌.లక్ష్మి, జిల్లా బాలల సంరక్షణాధికారి

1098కి ఫోన్‌ చేయండి..
పిల్లలు అక్కర్లేకపోతే చైల్డ్‌లైన్‌ ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 1098 కు ఫోన్‌ చేసి ఫలానా ప్రాంతంలో శిశువు ఉన్నాడని సమాచారం ఇస్తే చాలు.. క్షణాల్లో రక్షణ కల్పిస్తాం. లేదంటే నేరుగా అందించిన ఫర్వాలేదు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు వినియోగించుకోవాలి. అంతే తప్ప పిల్లలను చంపేయడం నేరం.
 – వి.లక్ష్మణరావు, చైర్మన్, జిల్లా బాలల సంక్షేమ సమితి   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా