సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి | Sakshi
Sakshi News home page

సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Published Mon, Aug 12 2019 4:46 AM

MP Vijayasai Reddy Call for Social Media Co-ordinators - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా వలంటీర్లకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అవినీతి రహిత పాలన అందించేందుకు చేస్తున్న కృషిని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో ఉన్న సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది.

పార్లమెంట్, అసెంబ్లీ, మండలాల కో ఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్, విజయవాడ పార్లమెంట్‌ ఇన్‌చార్జి పొట్లూరి వరప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి ప్రసాదరాజు, వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి రాజ్‌ కసిరెడ్డి, పార్టీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ హర్షవర్ధన్, ఐటీ విభాగ ప్రధాన కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంలో పార్టీ సోషల్‌ మీడియానే ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు. పార్టీకి అనుబంధంగా 14 సంఘాలు ఉన్నాగానీ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌.. ముందుగా సోషల్‌ మీడియా వలంటీర్లతో సమావేశం కావాలని సూచించారని, ఇది వలంటీర్ల కృషి, శ్రమకు గుర్తింపు ఇచ్చినట్లేనని చెప్పారు.

సోషల్‌ మీడియా వలంటీర్లపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసేందుకు కృషి చేయాలని వారిని కోరారు. వలంటీర్లకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడే సోషల్‌ మీడియా వలంటీర్లకు తగిన గుర్తింపునిస్తామన్నారు.

Advertisement
Advertisement