ఎమ్మార్పీ గాలికి.. ధరలు పైపైకి | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీ గాలికి.. ధరలు పైపైకి

Published Sun, Nov 24 2013 4:15 AM

MRP prices are very high

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: మద్యం వ్యాపారంలో నిబంధనల అమలు సాధ్యం కానిపనిలా మారింది. సిండికేట్లను అరికట్టేందుకు మద్యం పాలసీలో ఎన్ని మార్పులు తెచ్చినా ఫలితం కరువవుతోంది. ఎమార్పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్యం ధరలకు రెక్కలు తెచ్చేస్తున్నారు. మరోవైపు 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నారు. నిర్ణీత వేళల్లోనే మద్యం అమ్మకాలు జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టినా ఎక్సైజ్ శాఖ మాత్రం ఇంకా మేలుకోలేదు. జిల్లాలో 348 మద్యం దుకాణాలు, 56 బార్లు ఉన్నాయి. ఒక్క నెల్లూరులోనే పెద్దసంఖ్యలో బార్లు ఏర్పాటైవున్నాయి. బార్లలో
 
 మినహా షాపుల్లో ఎమ్మార్పీకే మద్యాన్ని విక్రయించాల్సి ఉంది. ఇది కేవలం నిబంధనలకే పరిమితమవుతోంది. మద్యాన్ని ఎమ్మార్పీకే విక్రయించాలని, ఒక్క రూపాయి అదనంగా విక్రయించినా కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు మూణ్నాళ్ల ముచ్చటయ్యాయి. ఆబ్కారీ సంవత్సరం మొదట్లో ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఎమ్మార్పీ నిబంధనను ఉల్లంఘిస్తున్న పలు మద్యం షాపులను సీజ్ చేశారు. అప్పట్లో కొద్ది రోజులు ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరిగాయి. అనంతరం కమిషనర్ మారడంతో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.
 
 వ్యాపారులు సిండికేట్‌గా మారి ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు సాగిస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిర్ణీత రేటు కంటే అదనంగా రూ.10 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తున్నారు. ఈవిషయాన్ని ప్రశ్నిస్తే తాము అమ్మేది ఇంతే...ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మందుబాబులను బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మద్యం వ్యాపారులతో వారు కుదుర్చుకున్న ఒప్పందాలే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 ఇష్టారాజ్యంగా విక్రయాలు
 నిబంధనల ప్రకారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరవాలి. బార్‌లో విక్రయాలకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉంది. మద్యం దుకాణాల ఎదుట బహిరంగంగా తాగేందుకు అనుమతించరాదు. మద్యం వ్యాపారులు ఈ నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ సమయంలోనైనా మందుబాబులకు మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎస్పీ రామకృష్ణ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఎక్సైజ్ అధికారుల్లో మాత్రం ఇంకా కదలిక రాలేదు.
 
 అనధికారిక బార్‌లుగా దాబాలు
 గతంలో జాతీయ రహదారులకే పరిమితమైన దాబాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వెలిశాయి. జిల్లాలోని 90 శాతం దాబాలు అనధికారిక బార్‌లుగా కొనసాగుతున్నాయి. వీటిలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంచడంతో పాటు తాగేందుకూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరోవైపు బెల్ట్‌షాపులు సైతం పల్లెల్లో పుట్టగొడుగుల్లా వెలిసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.
 
 నిబంధనల అమలుపట్టని అధికారులు
 మద్యం వ్యాపారంలో నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించారు. నెలానెలా అందుతున్న మామూళ్లే ఆ మౌనం వెనుక ఉన్న కారణమని ఆరోపణలున్నాయి. నెల్లూరులో ఒక్కో మద్యం దుకాణం నిర్వాహకులు సంబంధిత పోలీసుస్టేషన్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.5 నుంచి రూ.10 వేల వరకు నెల మామూలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇంకా ఎక్కువ మొత్తంలో చేరుతున్నట్లు సమాచారం.   
 

Advertisement
Advertisement