అప్పుడు నాకు మీరెంత ముట్టజెప్పారు: ముద్రగడ | Sakshi
Sakshi News home page

‘అప్పుడు నాకు మీరెంత ముట్టజెప్పారు?’

Published Wed, Aug 16 2017 2:39 PM

అప్పుడు నాకు మీరెంత ముట్టజెప్పారు: ముద్రగడ

కిర్లంపూడి: తమ జాతి ఆకలి తీరుస్తానని చెప్పి, ఓట్లు వేయించుకుని మమ్మల్ని ఎండలో నిలబెట్టారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. కిర్లంపూడిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని గుర్తు చేయడానికి పాదయాత్ర చేయదలిస్తే మమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచుతున్నారన్నారు. మాటి మాటికి మీ వెనుక ఎవరో ఉన్నారని ముఖ్యమంత్రి గారు అంటున్నారు.. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం నడిపించినప్పుడు నాకు చంద్రబాబు ఎంత ముట్టజెప్పారో చెప్పాలన్నారు. ఈ నెల 14 వ తేదీన శుభవార్త చెబుతారని ఆనందించాను.. కానీ మా జాతి చెవితో అతిపెద్ద కాలీఫ్లవర్ పువ్వులు పెట్టడం జరిగిందని వ్యాఖ్యానించారు.
 
మాకు చెవిలో పువ్వులు పెట్టడం మాని, రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. తమరు అమరావతిలో నిర్మించుకున్న నూతన భవనాన్ని దోచుకోవటానికి మా జాతి అమరావతి రావటం లేదని, మా జాతికి ఇచ్చిన హామీలను గుర్తు చేయటానికి ఛలో అమరావతి నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ జాతి ప్రజలను ఎండలో ఉంచి చంద్రబాబు సుఖాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. తమ జాతి ఆగ్రహాన్ని కచ్చితంగా చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందన్నారు. తమ కుమారుడు మంత్రి పదవి గురించి చంద్రబాబు తహతహలాడారే.. తమ జాతి రిజర్వేషన్  కోసం తహతహలాడటం తప్పా అని ప్రశ్నించారు.  
 
జిల్లాలో సెక్షన్  30 ,144 సెక్షన్లు అమల్లో వున్నప్పుడు చంద్రబాబు బహిరంగ సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. చట్టాలు.. సెక్షన్లు తమకు వర్తించవా అని నిలదీశారు. చట్టం అందరికీ చుట్టమే.. తమకు మాత్రమే కాదని వ్యంగ్యంగా మాట్లాడారు. ఎవరన్నా వయస్సు పెరిగేకొద్దీ హుందాగా, నిజాయితీగా వ్యవహరిస్తారు.. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా అబద్ధాల చక్రవర్తిగా కొనసాగుతున్నారని విమర్శనాస్ర్తాలు సంధించారు. కాకినాడ, నంద్యాల ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో ఆలోచించగలిగే విజ్ఞత మా జాతికి వుందని ఆయన అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement