వైభవంగా ముక్కోటి ఏకాదశి | Sakshi
Sakshi News home page

వైభవంగా ముక్కోటి ఏకాదశి

Published Tue, Dec 22 2015 1:55 AM

వైభవంగా ముక్కోటి ఏకాదశి

ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
తిరుమలలో 90,000 మందికి దర్శనం

 
సాక్షి, నెట్‌వర్క్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తజన సాగరమైంది. గతంలోకంటే ఈసారి సామాన్య భక్తులకు దర్శన కష్టాలు తగ్గాయి. వీఐపీ టికెట్ల కేటాయింపుల్లో భారీగా కోత పడింది. రోజంతా నిరీక్షించిన భక్తులు వైకుంఠ ద్వార దర్శనం తర్వాత ఆనందపరవశులయ్యారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం వేకువజామున ఒంటి గంట నుంచి భక్తులను క్యూలోకి తీసుకున్నారు. భక్తులకు ఆహార సమస్యల్లేకుండా అన్ని రకాల అన్నప్రసాదాలు, మంచినీరు, కాఫీ, టీ, వేడిపాలు అందజేశారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలనుంచి సామాన్య భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి వరకు సుమారు 90 వేల మందికి దర్శనం కల్పించారు. టీటీడీ ఈవోగా దొండపాటి సాంబశివరావు బాధ్యతలు చేపట్టాక వీఐపీ సేవ లకు భారీగా కోతపడింది. రెండేళ్ల ముందు వరకు 10 వేలు దాటే వీఐపీ టికెట్లు గతేడాది 2,474 ఇవ్వగా, ఈసారి 2,800 లోపే ఇచ్చారు. సామాన్య భక్తులకు ఇబ్బందిలేకుండా ఆ టికెట్లు పొందిన ప్రముఖులకు అర్ధరాత్రి తర్వాత శ్రీవారి దర్శనం ప్రారంభించి 3.30 గంటలకే పూర్తిచేశారు. ఆ తర్వాత సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు.  

స్వర్ణరథంపై సర్వాంతర్యామి దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో సోమవారం స్వర్ణరథోత్సవం(రథరంగ డోలోత్సవం) వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వర్ణకాంతుల స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తకోటికి దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి 11వరకు స్వర్ణ రథోత్సవం ఊరేగింపు అశేష భక్తజనం గోవిందనామ స్మరణల మధ్య వేడుకగా సాగింది. స్వర్ణ రథోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు కుటుంబం, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

ముగ్గురికి తీవ్రగాయాలు
స్వర్ణ రథానికి మెట్లుగా వాడే ఇనుప కమ్మీ స్టాండుపై భక్తులు ఎక్కడంతో అది పక్కకు ఒరిగిపోవడంతో ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో టీటీడీ ఫొటోగ్రాఫర్‌తోపాటు మరో ఇద్దరు పత్రికా ఫొటోగ్రాఫర్లకు గాయాలయ్యాయి.  
 
సహజ శిలామూర్తికి క్షీరాభిషేకం
 తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని సహజ శిలామూర్తికి సోమవారం భక్తులు క్షీరాభిషేకం, పూజలు చేశారు. 30 అడుగుల గజపుష్ప, తులసి మాలతో అలంకరించారు. శిరస్సుపై కిరీటం, ముఖం పైభాగంలోని నుదురు, కను రెప్పలు, కళ్లు, ముక్కు, నోరు, కంఠం, కంఠాభరణం, హృదయ లక్ష్మితో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఈ శిలామూర్తిని తొలిసారిగా 2012, జనవరి 4న వైకుంఠ ఏకాదశి రోజున సాక్షి దినపత్రిక తమ పాఠకులకు పరిచయం చేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్త బృందాలు ఐదేళ్లుగా క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

కల్యాణ వెంకన ్నకు బంగారు కిరీటాలు
చంద్రగిరి: చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం మూడు బంగారు కిరీటాలు కానుకగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త 1.7 కిలోల బరువున్న ఈ మూడు బంగారు కిరీటాలను అందజేశారు. టీటీడీ జేఈవో పోలా భాస్కర్ ఈ కిరీటాలను దాతల నుంచి స్వీకరించారు. వీటి విలువ సుమారు రూ.52.27 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు.

ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన మల్లన్న
శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. దాదాపు 70వేలకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. గర్భాలయ ఉత్తర ద్వారంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉత్సవమూర్తులను రావణవాహనంపై గ్రామోత్సవం చేపట్టారు.
 
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలె, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, రంజన్ గోగయ్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జస్టిస్ స్వతంత్రకుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు తిరుమలేశుని దర్శించుకున్నారు. రాములవారి మేడ నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారిని, అనంతరం వకుళమాతను దర్శిం చుకుని, వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేశారు. హుండీలో కానుకలు సమర్పించారు. న్యాయమూర్తులకు ఆలయ అధికారులు ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
Advertisement