విజయవాడలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి | Sakshi
Sakshi News home page

విజయవాడలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి

Published Wed, Sep 6 2017 2:08 AM

విజయవాడలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి - Sakshi

రేపు సీఎం శంకుస్థాపన: ఏఏఐఎంఎస్‌ వెల్లడి
 
సాక్షి, అమరావతి: విజయవాడలో 300 పడకలతో నిర్మించనున్న అమరావతి అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏఏఐఎంఎస్‌) మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వ్యవస్థాపక అధ్యక్షుడు డా.నవనీత కృష్ణ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆస్పత్రిని పూర్తిగా ప్రవాస భారతీయులే నిర్మిస్తున్నారని, ప్రాజెక్టుకు సుమారు రూ.600 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసినట్టు చెప్పారు. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.

ఈ నేపథ్యంలో పలువురు ప్రవాసాంధ్రులు కలసి విజయవాడలో ఆస్పత్రితో పాటు వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నం వద్ద 20 ఎకరాల స్థలం ఇచ్చిందని వివరించారు. తొలి దశలో 300 పడకలతో ఆస్పత్రిని ప్రారంభిస్తామని.. ఆ తర్వాత రెండు, మూడు దశల్లో మరో 700 పడకలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలి దశ నిర్మాణాన్ని 2019 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. సమావేశంలో సంస్థ వైస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్, సీఎఫ్‌వో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement