రణరంగం | Sakshi
Sakshi News home page

రణరంగం

Published Sat, Jul 25 2015 12:18 AM

రణరంగం - Sakshi

బందరులో కలెక్టరేట్, బెజవాడలో సబ్‌కలెక్టరేట్ ముట్టడి
పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట
పలువురికి అస్వస్థత కార్మికులు, నేతల అరెస్ట్

 
కడుపుమండిన కార్మికులు సమరానికి సై అన్నారు. పోలీసులకు ఎదురొడ్డి నిలిచారు. ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదంటూ ముందుకు దూసుకెళ్లారు. బందరు, బెజవాడల్లో మున్సిపల్ కార్మికులు తలపెట్టిన కలెక్టరేట్, సబ్‌కలెక్టరేట్‌ల ముట్టడి రణరంగాన్ని తలపించింది. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు పక్షాల మధ్య తోపులాటలు జరిగాయి. విజయవాడలో సబ్‌కలెక్టరేట్ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది. ఈ ఘటనలో పలువురు నాయకులు,
 కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు.
 
మచిలీపట్నం (చిలకలపూడి) : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు మచిలీపట్నంలో కలెక్టరేట్‌ను, విజయవాడలో సబ్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ట్రేడ్ యూనియన్ల నేతల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన ముట్టడి కార్యక్రమంలోకార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది నాయకులు, కార్మికులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లి కలెక్టర్ చాంబర్ ఎదుట బైఠాయించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను, కార్మికులను విచక్షణారహితంగా ఈడ్చుకువెళ్లి పోలీసు వాహనాల్లో పడేశారు. వారిని చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
చంద్రబాబువి మోసపూరిత వాగ్దానాలు...
 తొలుత కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో తాను పూర్తిగా మారిపోయానని, తనను గెలిపిస్తే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని, వేతనాలు పెంపుదల చేస్తానని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తానని మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు సిగ్గుమాలిన తనంతో కార్మికులపై ఉక్కుపాదం మోపుతామని నయవంచక ప్రకటనలు చేస్తున్నారన్నారు. బందరు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ కార్మికులు సమ్మె చేస్తుంటే వారిని తొక్కుకుంటూ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లడం దారుణమన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర బందరు పట్టణాన్ని బృందావనం చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని, అందుకు కావాల్సింది కార్మికులేనని పేర్ని నాని గుర్తుచేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి, తాము అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు మాట్లాడుతూ విదేశీ మోజులో ఉన్న చంద్రబాబు పేద కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సమయం కూడా కేటాయించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. అదేమంటే కార్మికులపై ఉక్కుపాదం మోపుతామని, సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రకటిస్తున్నారన్నారు. దీనిని తాము సహించేది లేదన్నారు.

 కలెక్టర్ చాంబర్ వద్ద బైఠాయింపు
 కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ముట్టడి కార్యక్రమం అనంతరం లోపలికి వెళ్లిన నాయకులు, కార్మికులు కలెక్టర్ చాంబర్‌కు వెళ్లే ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో డీఎస్పీ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి నాయకులను, కార్మికులను విచక్షణారహితంగా ఈడ్చుకువెళ్లి పోలీసు వ్యాన్‌లో స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అరెస్టులను నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద కూడా నాయకులు, కార్మికులు ధర్నా చేపట్టారు.

 కార్మికులను ఆస్పత్రికి తరలించిన నాని
 కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్మికులు, ఓ మహిళా హోంగార్డు స్పృహ కోల్పోయారు. వారిని వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని స్వయంగా తన వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా, జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, కౌన్సిలర్లు షేక్ అచ్చాబా, మేకల సుధాకర్‌బాబు, శీలం మారుతీరావు (బాబ్జి), లంకా సూరిబాబు, గూడవల్లి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నేతలు అబ్ధుల్ మతీన్, బుల్లెట్ ధర్మారావు, సీపీఎం నేత వై.నరసింహారావు, సీఐటీయూ నేతలు కె.నరసింహారావు, ఎన్‌సీహెచ్ శ్రీనివాసరావు, ఎ.కమల, సీపీఐ నాయకులు మోదుమూడి రామారావు, లింగం ఫిలిప్, మునిసిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విజయవాడలో..
 విజయవాడ : ఔట్‌సోర్సింగ్ కార్మికులు శుక్రవారం నిర్వహించిన సబ్ కలెక్టర్ ముట్టడి విజయవంతమైంది. శ్రామిక ‘శక్తి’ని కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు నగరానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు, ట్రేడ్ యూనియన్ నేతల సారథ్యంలో శాంతియుతంగా ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకోబోగా, వైఎస్సార్ టీయూ నాయకుడు పి.గౌతమ్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర అధ్యక్షులు పి.మధు, కె.రామకృష్ణ, సీపీఎం రాజధాని ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు తదితరులు గేటు ఎక్కి లోపలికి ప్రవేశించారు. కార్మికులు గేట్లను తోసుకుంటూ లోపలకు పరుగులు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోబోగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నాయకులు  పి.మధు, గౌతమ్‌రెడ్డి, బాబూరావు, ఓబులేసుతో పాటు పలువురు కార్మికులు సొమ్మసిల్లిపడిపోయారు. కోలుకున్న అనంతరం కార్యాలయంలో బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement