పురాధ్యక్షుల ఎన్నిక నేడు | Sakshi
Sakshi News home page

పురాధ్యక్షుల ఎన్నిక నేడు

Published Thu, Jul 3 2014 1:23 AM

Municipality  Election today

విజయనగరం మున్సిపాలిటీ : మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరే సమయం అసన్నమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఆయా మున్సిపాలిటీల  ప్రిసైడింగ్ అధికారులు  సమక్షంలో కౌన్సిలర్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం వారు చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  ఆయా మున్సిపాలిటీలకు చెందిన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
 జిల్లాలో  నాలుగు మున్సిపాలిటీల ఉండగా...  విజయనగరం, సాలూరు మున్సిపాలిటీలతో పాటు పార్వతీపురం చైర్మన్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.  విజయనగరం మున్సిపాలిటీలో 40 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా టీడీపీ 32 స్థానాలు, కాంగ్రెస్ ఐదు, వైఎస్‌ఆర్ సీపీ రెండు,  స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో  ఇక్కడ అధ్యక్ష ఎన్నిక  ఏకగ్రీవంగా జరగనుంది.   సాలూరు మున్సిపాలిటీలో 29 వార్డులుండగా టీడీపీ 17 స్థానాలు, వైఎస్‌ఆర్ సీపీ తొమ్మిదిస్థానాలు, కాంగ్రెస్ మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
 
 దీంతో ఈ మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థే అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.  పార్వతీపురం మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా అందులో తెలుగుదేశం పార్టీ 14 స్థానాలు, వైఎస్‌ఆర్‌సీపీ 10 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు ఆరు స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ అధ్యక్ష ఎన్నికకు స్వతంత్ర అభ్యర్థులు కీలకం కావడంతో ఈ మున్సిపాలిటీలో క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలు విస్తృత పయత్నాలు చేస్తున్నా  ఇక్కడ కూడా టీడీపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నట్టు సమాచారం.
 
 బొబ్బిలిలో రసవత్తరంగా మారిన చైర్మన్ ఎన్నిక :
 బొబ్బిలి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పాటు రసవత్తరంగా మారింది. ఇక్కడ మొత్తం 30 వార్డులుండగా అందులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 కౌన్సిలర్ స్థానాలు, తెలుగుదేశం పార్టీ 13, కాంగ్రెస్  రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.  ఇక్కడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ  అధికారంలో ఉన్న టీడీపీ  ఈ మున్సిపాలిటీలో పాగా వేసేందుకు కుటిల రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా 9వ వార్డుకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని తమ వైపు తిప్పుకునేం దుకు టీడీపీ నేతలు యత్నించి నప్పటికీ  విప్ జారీ చేసే అవకాశం ఉండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్న ట్లు సమాచారం.
 
 ఈ నేపథ్యంలో ఇక్కడ రెండు నెలలుగా క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. బొబ్బిలిలో వైఎస్‌ఆర్ సీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణారంగారావు తన దైన శైలిలో రాజకీయ వ్యూహం రచిస్తున్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న కేంద్రమంత్రి పి.అశోక్‌గజపతిరాజు, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సుజయ్‌కృష్ణరంగరావు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఏ  పార్టీకి మద్దతు పలుకుతారో ఆ పార్టీ పాలకవర్గాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement