ఆ 22 రోజులు ఏం జరిగింది? | Sakshi
Sakshi News home page

ఆ 22 రోజులు ఏం జరిగింది?

Published Sun, May 27 2018 2:59 AM

Mystery continues in the TTD Issue - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆభరణాలు.. పోటు తవ్వకాలు.. కైంకర్యాలపై మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో నెలకొన్న మిస్టరీ కొనసాగుతోంది. మరోవైపు.. పోటులో తవ్వకాలు విలువైన ఆభరణాల కోసమేనన్న వాదన ప్రభుత్వ, టీటీడీ వైఖరితో బలపడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. తవ్వకాలకు సంబంధించిన ఫుటేజీ మాయమైనట్లు కూడా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే, గతంలోని ‘సవాల్‌ ఈ జవాబ్, మన ఆలయాల చరిత్ర’పుస్తకాల్లో ప్రస్తావించిన అంశాలు కూడా ఇప్పుడు తెరమీదకు రావడంతో టీటీడీలో అవి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

తవ్వకాలు జరిపిన ప్రతిసారీ ఏదో ఒక ఆటంకాలు రావటం.. ఆ వెంటనే తవ్వకాలు నిలిపివేయటం జరుగుతున్నట్లు బ్రిటిష్‌ కాలంలో కలెక్టర్‌గా పనిచేసిన జేమ్స్‌ స్టార్టన్‌ శ్రీవారి ఆలయంపై ‘సవాల్‌ ఈ జవాబ్‌’పుస్తకం రాశారు. శ్రీవారి ఆలయం గురించి బ్రిటిష్‌ వారు తెలుసుకునే క్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు జేమ్స్‌ సమాధానాలిచ్చారు. వీటిని గతంలో తహశీల్దార్‌గా పనిచేసిన వీఎన్‌ శ్రీనివాసరావు పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఆ వివరాలన్నింటినీ గతంలో టీటీడీలో పనిచేస్తూ రిటైరైన సొరకాయల కృష్ణారెడ్డి ‘గోపీకృష్ణ’పేరుతో ‘మన ఆలయాల చరిత్ర’అనే పుస్తకంలో పొందుపరిచారు. అందులో ఏముందంటే..

‘‘శ్రీవారికి అనేకమంది కానుకలు సమర్పించారు. వాటిని ఎక్కడ దాచాలో తెలియక అప్పట్లో ఆలయ నిర్వాహకులు ప్రదక్షిణ ప్రాకారంలో పూడ్చిపెట్టారు. ఆ ప్రదక్షిణ ప్రాకారం 300 గజాల పొడవు.. 40 గజాల వెడల్పు కలిగి ఉంటుంది. ఆ విస్తీర్ణంలో రాజులు శ్రీవారికి సమర్పించిన కానుకలను బండల కింద ఎక్కడ పూడ్చిపెట్టారో తెలుసుకునేందుకు అప్పట్లో తహశీల్దార్‌గా పనిచేసిన శ్రీనివాసాచార్యులు ప్రయత్నించారు. అయితే.. ఆయనకు, ఆయనతో పనిచేసిన వారు అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో అది అపచారంగా భావించి వారి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి నుంచి అనేకమంది తవ్వకాలు జరిపి విఫలమయ్యారు. ఆ తరువాత ప్రదక్షిణ ప్రాకారాన్ని మూసివేశారు. అందులో శ్రీ రామానుజస్వామి, తొండమాన్‌ చక్రవర్తి సమర్పించిన విలువైన కానుకుల కూడా బండల కింద దాచి ఉంచినట్లు ప్రచారం ఉంది. వాటిలో అతి ముఖ్యమైనది నాగా భరణం. ఇది శివుని పూజకు ఉపయోగించే బిల్వ పత్రాలను పోలి ఉంటుంది’’.

సీసీ ఫుటేజ్‌ ఎందుకు బయటపెట్టలేదు?
తిరుమల శ్రీవారి గర్భాలయంలో మినహా మిగిలిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో పోటు తవ్వకాలు.. ఆభరణాల మిస్సింగ్, కైంకర్యాలకు సంబంధించి అన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యే అవకాశాలు ఉన్నాయని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, రమణ దీక్షితులు చెన్నైలో చేసిన ఆరోపణలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లను మాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆలయంలో ఎటువంటి అపచారాలు జరగనప్పుడు సీసీ ఫుటేజ్‌లు బయటపెట్టవచ్చు కదా? అని భక్తులు ప్రస్తావిస్తున్నారు. 

తవ్వకాలు చూసి ఆశ్చర్యపోయా!
పోటులో తవ్వకాలు చేపట్టారని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్రీస్తుపూర్వం 1150లో నిర్మించిన ఆలయంలోని పోటులోనే ప్రతిరోజూ మూడుపూటలు మూడు రకాల ప్రసాదాలు తయారుచేసి స్వామి వారికి సమర్పిస్తారు. అటువంటి ప్రాకారాలను పగులగొట్టటానికి 2017 డిసెంబర్‌ 8 నుంచి 30 వరకు మూసివేశారనేది రమణదీక్షితులు చేసిన ప్రధాన ఆరోపణ. ఆలయంలో విమాన ప్రాకారం, బూందిపోటు, లోపల పోటులో ఏ పనిచేయాలన్నా ఆగమశాస్త్రం ప్రకారమే పనులు చేపట్టాల్సి ఉంది. అంతేకాక.. ఆగమ సలహాదా రును సంప్రదించాల్సి ఉన్నా అటువంటి ప్రయత్నాలేవీ చేయలేదన్నది ఆయన వాదన.

ఈ నేపథ్యంలో అక్కడ చేపట్టిన పనుల గురించి ఎవ్వరికీ తెలియదని, అంత రహస్యంగా ఎందుకు పనులు చేయాల్సిన అవసరం ఏముందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కాగా, డిసెంబర్‌ 20న పోటును పరిశీలించే వరకు ఆ అపచారం గురించి తనకు తెలియదని రమణదీక్షితులు వెల్లడించారు. పోటులో జరిగిన తవ్వకాలు చూసి తాను ఆశ్చర్యపోయానని, పురాతనమైన గోడలను, బండలను పగులగొట్టటం చూసి బాధవేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే.. బ్రిటిష్‌ హయాంలో జిల్లా కలెక్టర్‌ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు, రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు పోలికలు ఉన్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు.  

Advertisement
Advertisement