విశాఖ పునర్నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్ | Sakshi
Sakshi News home page

విశాఖ పునర్నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్

Published Mon, Oct 20 2014 2:00 AM

విశాఖ పునర్నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్ - Sakshi

ప్రపంచబ్యాంకు, ఏడీబీ నుంచి నిధులకు ప్రయత్నం: ఏపీ సీఎం చంద్రబాబు
* ఆస్తి నష్టం అంచనాలకు మించి ఉంది
* అందరి సహకారంతోనే ఉత్తరాంధ్రను సాధారణ స్థితికి తెచ్చాం
* విద్యుత్తు సంస్థలకు నష్టం రూ.1,400 కోట్లుదాకా ఉంది
* అంకితభావంతో పనిచేసిన విశాఖ కలెక్టర్, ఉద్యోగులకు అభినందనలు

సాక్షి, హైదరాబాద్/విశాఖ రూరల్: హుదూద్ తుపాను ధాటికి పూర్తిగా దెబ్బతిన్న విశాఖ నగర పునర్నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ల నుంచి నిధులు తెచ్చేందుకు మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామ ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖను సుందరవనంగా, ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా తయారు చేస్తామని తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, అనంతరం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా అంచనాలకు అందనివిధంగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

ఆయువు పట్టు లాంటి ఆర్థిక నగరం కుదేలైందని, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన స్మార్ట్ సిటీ ఇబ్బందుల్లో ఉందని అన్నారు. తుపాను ఓ నగరాన్ని అల్లకల్లోలం చేసిన సంఘటన ఇటీవలి కాలంలో ఎక్క డా లేదన్నారు. 30 లక్షలమంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. త్వరలో తాను ప్రధాని మోదీని కలిసి నగర పునర్నిర్మాణంపై చర్చిస్తానన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు నీతికి మారుపేరని, నిజాయితీ వీరి వారసత్వంలోనే ఉందని కితాబిచ్చారు.
 
నాకు చాలా సంతోషంగా ఉంది
ఆరు రోజులపాటు తాను విశాఖలోనే ఉండి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా ఎన్ని చేయాలో అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన బాధ్య త నెరవేర్చానని, సంతోషంగా ఉందని చెప్పారు. మళ్లీ మంగళవారం రాత్రికి విశాఖ వస్తానని, రెండు రోజులిక్కడే ఉండి పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దుతానని అన్నారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పశ్చి మబెంగాల్ రాష్ట్రాలతోపాటు అధికార యం త్రాంగం, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తుపాను నష్టం నుంచి ఉత్తరాంధ్ర తేరుకునేలా చేయగలిగామని చెప్పారు. తుపాను వచ్చిన రెండోరోజే ప్రధాని మోదీ విశాఖకొచ్చి ప్రజలకు భరోసా కల్పించారన్నారు.
 
ప్రభుత్వరంగానికే భారీ నష్టం
తుపాను నష్టం ప్రభుత్వ రంగంలోనే భారీగా ఉందన్నారు. ఒక్క విద్యుత్తు శాఖ నష్టమే రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు ఉందని తెలిపారు. పెనుగాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. 30 వేల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని, వేలాది ట్రాన్స్‌ఫార్మర్లు కుప్పకూలాయని, వందలాది సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఎన్టీపీసీలో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10 లక్షల సర్వీసు కనెక్షన్లు ఇవ్వగా, ఇంకా 13 లక్షల కనెక్షన్లను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు విద్యుత్ సరఫరా చేస్తామని, 22వ తేదీ నాటికి మండల కేంద్రాల్లో, 25వ తేదీకి జిల్లా మొత్తంగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ రాని ప్రాంతాలు, ఏజెన్సీలో 5 లీటర్ల కిరోసిన్ ఇస్తామన్నారు.పరిశ్రమల పునరుద్ధరణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు చెప్పారు.
 
పచ్చదనానికి ప్రణాళిక
విశాఖలో పచ్చదనం పరిరక్షణకు హార్టీకల్చర్ నిపుణులతో ప్రణాళిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. సోమవారం నుంచి చెట్లను ప్రూనింగ్ చేస్తామని చెప్పారు. అందమైన ల్యాండ్ స్కేపింగ్, తుపాన్లను తట్టుకొనేలా చెట్లను వేయడానికి ముంబై నుంచి కన్సల్టెంట్లు వచ్చారని అన్నారు.  విశాఖ జిల్లాలో 13 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తామని చెప్పారు.
 
ముకేష్ అంబానీ రూ.11 కోట్ల విరాళం
తుపాను బాధితుల సహాయార్థం రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రూ.11 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సీఎం  వెల్లడించారు.
 
23న కాగడాల ర్యాలీ
తుపాను చేసిన గాయాన్ని మరచిపోయేందు కు, విశాఖవాసుల్లో ఆత్మవిశ్వాసం నింపేం దుకు ఈ నెల 23న ఆర్కే బీచ్‌లో ‘తుపాను ను జయిద్దాం’ నినాదంతో కాగడాల ర్యాలీ నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక విశాఖ పునరుద్ధరణకు కృషి చేసిన ఇతర రాష్ట్రాల అధికారులు, సిబ్బందితో భారీ అభినందన సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇతర జిల్లాలవారికి విందు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ యువరాజ్‌ను ఆదేశించారు. సహాయక పనుల్లో కష్టపడిన వారిని గుర్తించి అవార్డులిచ్చి సత్కరిస్తామన్నారు.

Advertisement
Advertisement