బాక్సైట్ అనుమతుల్లో చంద్రబాబు దగా | Sakshi
Sakshi News home page

బాక్సైట్ అనుమతుల్లో చంద్రబాబు దగా

Published Wed, Nov 25 2015 7:49 PM

Naidu's dishonesty in bauxite licenses

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాక్సైట్ అనుమతుల విషయమై గిరిజనులను దగాచేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. బాక్సైట్ అనుమతుల ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆయన విజయవాడ నుంచి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా బాక్సైట్ అనుమతులు ఇవ్వొద్దని లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అనాడు చంద్రబాబు తాను ఇచ్చిన లేఖను విస్మరించి ఇప్పుడు మాట మార్చి బాక్సైట్ అక్రమ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారన్నారు. వారం రోజుల కిందట బాక్సైట్ గనుల విషయంలో అధికారులు ప్రభుత్వానికి తెలియకుడా ఉత్తర్వులు జారీ చేశారని చెప్పిన ముఖ్యమంత్రి తాజాగా వైట్‌పేపర్ పేరుతో వాటికి అనుమతులు మంజూరు చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు.

 ప్రభుత్వం ఏర్పడి 18నెలలు అవుతున్నా ఇంతవరకు గిరిజన సలహామండలి ఏర్పాటు చేయలేదన్నారు. విదేశీ కార్పొరేట్ సంస్థ రసాల్ కైమా కంపెనీ కోసం సీఎం బాక్సైట్ అనుమతులు మంజూరు చేయటం శోచనీయమన్నారు. అరకు, పాడేరు గిరిజన ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రజలు ఆందోళణ చేస్తున్నా ప్రభుత్వం మోసపూరితంగా బాక్సైట్‌కు అనుమతులు జారీ చేసిందని చెప్పారు.

ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో బాక్సైట్‌కు వ్యతిరేకంగా మైనింగ్ గిరిజన సంఘాల ఆద్వర్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా వామపక్ష పార్టీలన్నింటినీ సమీకరించి పోరాటంలో దిగుతామని చెప్పారు. ఈనెల 30వ తేదీన తమ పార్టీ కేంద్ర కమిటీ నాయకురాలు బృందాకరత్ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి బాక్సైట్ తవ్వకాలను పరిశీలిస్తారని చెప్పారు. ఆ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement