పెద్దలు పెట్టిన పేరు బోరు కొట్టిందా? | Sakshi
Sakshi News home page

పేరు మార్చుకోవాలంటే...!

Published Mon, Feb 25 2019 7:22 AM

Name CHange Details in Special Story - Sakshi

అల్లిపురం(విశాఖ దక్షిణం): స్కూల్‌ ధ్రువీకరణ పత్రాల్లో పేరు తప్పుగా నమోదైందా? పెద్దలు పెట్టిన పేరు బోరు కొట్టిందా? ప్రస్తుతం ఉన్న పేరు కలసిరావడం లేదని భావిస్తున్నారా? కారణం ఏదైనా మీరు మీ ఇష్ట ప్రకారం.. ఎప్పుడైనా పేరు మార్చుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

కలక్టర్‌కు దరఖాస్తు ఇలా...
పేరు మార్చుకోవాలనుకునేవారు ముందుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం రెండు పాస్‌పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటోలు, గెజిటెడ్‌ అధికారి జారీ చేసిన పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు రెండు కాపీలు, ప్రస్తుత పేరు, కొత్తపేరు, పేరు మార్పునకు నిర్ధిష్ట కారణం తెలుపుతూ అఫిడవిట్‌ను జతచేయాలి (రూ.10/రూ.20 నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ చెల్లుబాటు అవుతుంది) దీన్ని నోటరీ చేయించాలి.

పోలీసుల ధ్రువీకరణ తప్పనిసరి
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ అన్ని విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు కాపీలను గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌ చేయించాలి. నిరక్షరాస్యులు రేషన్‌ కార్డు, ఓటరు ఐడీ, విద్యుత్‌ బిల్లు, వాటర్‌ బిల్లు వీటిలో ఏదైనా ఒకదాని కాపీని గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించి సమర్పించాలి. ఐదేళ్ల కాలంలో తనపై ఎలాంటి కేసులూ లేవని, పోలీసుల రికార్డుల్లో తన పేరు లేదని పోలీస్‌ స్టేషన్‌ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. పేరు కలసి రావడం లేదనుకుంటే జ్యోతిష్యుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోని జతపరచాలి. వీటిని కలెక్టర్‌ పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్లు భావిస్తే పేరు మారుస్తూ ఆదేశాలు జారీ చేస్తారు.

ప్రభుత్వ సమాచార పత్రికలో ప్రచురించాలి..
అనంతరం పేరుమార్పు విషయంపై రాష్ట్రం(ప్రభుత్వ సమాచార పత్రిక)లో ప్రకటన జారీ కోసం ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకొని నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేరు మారుస్తూ కలెక్టర్‌ జారీ చేసిన జీవో కాపీని వారికి సమర్పించాలి.

రెండు పత్రికల్లో ప్రచురించడం మంచిది..
కనీసం రెండు ప్రముఖ స్థానిక దినపత్రికల్లోనూ పేరు మార్పుపై ప్రకటనలు ఇవ్వడం శ్రేయస్కరం. ఈ ప్రకటనల ప్రతులను దగ్గర ఉంచుకోవాలి. దినపత్రికలో పేరు మార్చుకున్నట్లు ప్రకటన ఇచ్చిన తరువాత ఎవరి నుంచైనా ఏమైనా అభ్యంతాలు వస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. సాధారణంగా ఎలాంటి అభ్యంతరాలు రావు. మైనరు పేరు మార్చాలనుకుంటే వారి తరపున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దరఖాస్తు చేయాలి.

ప్రభుత్వ ఉద్యోగులూ, ఎన్‌ఆర్‌ఐలు ఇలా...
ఒక వేళ పేరు మార్చుకునే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే కలెక్టర్‌ ద్వారా ఉత్తర్వులు పొందాల్సిన పనిలేదు. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపు పేపరుపై సహచర ఉద్యోగుల ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించి దాన్ని ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురణ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. ఓ ప్రముఖ ప్రాంతీయ దినపత్రికలోనూ సంబంధిత పత్రాన్ని ప్రచురించాలి. ఒక వేళ ఎన్‌ఆర్‌ఈలు తమ పేరు మార్చుకోవాలని భావిస్తే వారు తమ దరఖాస్తును భారతీయ ఎంబసీ లేదా హైకమిషన్‌ అటెస్టేషన్‌తో హాంశాఖకు పంపాలి. ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే న్యాయవాది సలహా తీసుకోవడం మంచిది.

పేరు మారిన తర్వాత ఇలా..
పేరు మారిన తర్వాత ఆ సమాచారాన్ని అవసరమైన వారికి తెలియజేయడం తప్పనిసరి. ఉద్యోగులైతే ఆ విషయాన్ని తమ కార్యాలయం ఉన్నతాధికారులకు తెలియజేయాలి. సర్వీసు రిజిస్టర్‌లో కొత్త పేరు నమోదు చేయించుకోవాలి. పోస్టాఫీసు, బ్యాంకు, ఆధార్‌ కార్డుల్లోనూ పేరు మార్చుకోవాలి.

వివాహితలు ఇంటి పేరు మార్చుకోవాలంటే..
వివాహితలు భర్త ఇంటి పేరును పెట్టుకోవడం ఆచారం, అలాంటివారు వివాహ నమోదు పత్రం లేదా భర్తతో కలసి సంయుక్తంగా అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

నేరపూరిత ఆలోచనలు చెల్లవు
అప్పులు చేసి పేరు మార్చుకుని పరారవుదామనుకుంటే కుదరదు. నేరపూరిత ఆలోచనల్లో భాగంగా పేరు మార్పునకు అవకాశంలేదు. ప్రముఖుల పేర్లను పెట్టేసుకుని గందరగోళానికి తెరతీయాలని భావిస్తే వీల్లేదు. ఇటువంటి ఆలోచనతో పేరుమార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు బహిర్గతమైతే. ఈ విషయంలో సహకరించిన వారందరినీ కోర్టు నేరస్తులుగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త..!

Advertisement

తప్పక చదవండి

Advertisement