జీవితంలో నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు: వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

‘జీవితంలో నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు’

Published Sat, Aug 19 2017 6:50 PM

Nandyal compaign: I can't Lie and give False Promises like Chandrababu, says YS Jagan



ఈ మూడేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ అయినా అమలు చేశారా?
►రేషన్‌ షాపులో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు
►మీ జగన్‌ అబద్ధం ఆడడు. మోసం చేయడు
►నాకున్నదల్లా వైఎస్‌ఆర్‌ ఇచ్చి పెద్ద కుటుంబమే నా ఆస్తి


సాక్షి, నంద్యాల : ‘ఎవరినో ఎమ్మెల్యే చేయడానికి మనం ఓటు వేయడం లేదు. మూడేళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాం. చంద్రబాబు చేసిన దుర్మార్గం, అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాం. హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడవటం న్యాయమేనా? నంద్యాలలో వైఎస్‌ఆర్‌ సీపీ పోటీ పెట్టకపోయి ఉంటే బాబు నంద్యాల వచ్చేవారా?. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క ఇళ్లు అయినా కట్టించారా? మూడేళ్ల పాలనలో పేదవాడికి ఒక్క ఎకరా అయినా భూమి ఇచ్చారా?.

ఈ మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా? వైఎస్‌ఆర్‌ హయాంలో రేషన్‌ షాపులకు వెళితే 9 రకాల సరుకులు ఇచ్చేవారు. చంద్రబాబు సీఎం అయ్యాక బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు బెల్టు షాపులు లేకుండా చేస్తామన్నారు. మూడేళ్లలో బెల్టు షాపులు తీసేయడం దేవుడెగురు. ప్రతి గ్రామంలో బెల్టు షాపులను అందుబాటులోకి తీసుకొచ్చారు.  వీధివీధికి ఓ బెల్టు షాపు, మెసేజ్‌ పెడితే మందు ఇంటికే. ఇదిగో ఇలా ఉంది చంద్రబాబు పాలన’  అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నక ప్రచారంలో భాంగా శనివారం 11వ రోజు రోడ్‌ షోలో ఆయన పెద్దబండ వద్ద జగన్‌ ప్రసంగించారు.

ఈ మూడేళ్లలో నంద్యాలను కాపాడటానికి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలన్న చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక హోదాను కూడా తీసుకురాలేదన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారని, జాబు ఇవ్వకపోతే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి 38 నెలలు అయిందని, అంటే ఆయన ప్రతి ఇంటికి రూ.76వేలు బాకీ పడ్డారన్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.... ‘రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు వచ్చిందా అని అడుగుతున్నా. చంద్రబాబు నిరుద్యోగ భృతి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. 2014 ఆగస్టు 14న సీఎం హోదాలో చంద్రబాబు కర్నూలు వచ్చారు. ఎయిర్‌పోర్టు, ట్రిపుల్‌ ఐటీ, స్మార్ట్‌ సిటీ, ఉర్దూ వర్సిటీ, మైనింగ్‌ స్కూల్‌ తెస్తామన్నారు. అలవికానీ హామీలను ఎన్నో చెప్పారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీని ఏ ఒక్కటీ అమలు చేయలేదు. జీవితంలో నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు. మట్టి నుంచి ఇసుక నుంచి, గుడి భూములు, రాజధాని భూములు, విశాఖ భూములను కూడా వదలలేదు.

చంద్రబాబులా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్భద్ధి, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా చూపే చానళ్లు, పేపర్లు నా దగ్గర లేవు. ఆయన మాదిరిలా నా దగ్గర సీఎం పదవి లేదు. నాకున్నదల్లా దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఇచ్చి పెద్ద కుటుంబమే నా ఆస్తి. వైఎస్‌ఆర్‌ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల గుండెల్లో బతికుండటమే నా ఆస్తి. మీ జగన్‌ అబద్ధం ఆడడు. మోసం చేయడు.  మాట మీద నిలబడే విశ్వసనీయతే నా ఆస్తి.  విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి.

జగన్‌ వాళ్ల నాన్న మాదిరే మాటపై నిలబడతాడన్న విశ్వసనీయతే నా ఆస్తి. నాన్న మాదిరే గొప్ప పరిపాలన అందిస్తాడనే నమ్మకం నాకున్న ఆస్తి. దేవుడి దయ, మీ ఆశీస్సులు నాకు కావాలి. రాజకీయాల్లో జవాబుదారితనం రావాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు అవినీతి సొమ్ముతో మీ దగ్గరకు వస్తాడు. ఆ అవినీతి సొమ్ములోంచి రూ.5వేలు మీ చేతిలో పెట్టి ఒట్టు వేయించుకుని మరీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. దెయ్యాలతో గొడవ పడాల్సిన పనిలేదు. మనసులో దేవుడిని తలుచుకోండి. ధర్మంవైపే నిలిచి శిల్పా మోహన్‌ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి’ అని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement