నూతన శకానికి నవరత్నాలు | Sakshi
Sakshi News home page

నూతన శకానికి నవరత్నాలు

Published Wed, Sep 26 2018 7:01 AM

Navarathnalu For our Best Future YS jagan in Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం : వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలకు విశేష ప్రాచుర్యం లభిస్తోంది. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రత్నాల్లాంటి పథకాలు అమలు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినప్పటి నుంచి పేద, బడుగు, బలహీన వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ నలుగురు ఒకచోట గుమిగూడినా ఈ పథకాలపైనే చర్చ జరుగుతోంది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం నాటి పాదయాత్రలో లక్కవరపుకోట మండలం గంగూబూడి జంక్షన్‌ వద్ద ఓ ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు నవరత్నాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. తొమ్మిది పథకాలకు 9 స్టాల్స్‌ ఏర్పాటు చేసి ఆ పథకానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా, జలయజ్ఞం, వైఎస్సార్‌ ఆసరా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి , ఫీజు రీయింబర్స్‌మెంట్, మద్యపాన నిషేధం, పేదలందరికీ ఇళ్లు, పింఛన్ల పెంపు పథకాలకు సంబంధించి విద్యార్థులు లబ్ధిదారుల వేషధారణలో ఉంటూ ప్రయోజనాలు వివరించారు. విద్యార్థులు పథకాల వివరాలు వెల్లడిస్తుంటే పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన వెన్నంటి ఉన్న నాయకులందరూ చిరునవ్వులు చిందించారు.     – ప్రజా సంకల్పయాత్ర బృందం

పరిశ్రమలకు కష్టకాలం..
టీడీపీ పాలనలో పరిశ్రమలు కష్టకాలం ఎదుర్కొంటున్నాయి. అధికారంలోకి రాగానే పవర్‌ సబ్సిడీ ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో పరిశ్రమల నిర్వహణ ఇబ్బందిగా మారింది. జిందాల్‌ పరిశ్రమను ఎప్పుడు మూస్తారో? ఎప్పుడు తెరుస్తారో? తెలియని పరిస్థితి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఫెర్రో అల్లాయీస్‌ కంపెనీలు పదేళ్లు సక్రమంగా నడవగా.. బాబు పాలనలో మూతబడుతున్నాయి. జగనన్న అధికారంలోకి వస్తే మా కార్మికుల బతుకులు మారుతాయన్న నమ్మకం ఉంది. మా సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకునేందుకు వందలాదిగా తరలివచ్చాం.
– కె.ఈశ్వరరావు, జింధాల్‌ కార్మికుడు

ఒక్కపనీ జరగలేదు 
మా ఊరిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నాలుగేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. అందుకనే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చాను. జగన్‌ సీఎం కాగానే వేపాడ మండలం సోంపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, కల్యాణ మండపం నిర్మించాలని, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని విన్నవించాను. ఆయన సీఎం అయితే సమస్యలు తొలగుతాయన్న నమ్మకం ఉంది.     – ఎమ్‌.గంగరాజు, మాజీ సర్పంచ్,సోంపురం గ్రామం, వేపాడ మండలం

రైతుకు మేలు జరుగుతుంది...
దివంగతనేత రాజన్న అందించిన సంక్షేమం రైతులకు చేరాలంటే జగన్‌ సీఎం కాకతప్పదు. రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని, పండిన పంటలకు గిట్టు భాటు ధర కల్పిస్తారన్న పూర్తి నమ్మకం జగన్‌పై ఉంది.–  వై.హనుమంతురెడ్డి, కొత్తవలస

రాజన్నపాలన రావాలి
దివంగతనేత రాజన్న అందించిన పాలన జగన్‌తోనే సాధ్యం. రానున్న కాలంలో జగన్‌ సీఎం కావడం తథ్యం. జగన్‌ వెంట జనం ఉన్నారు. ఎవరినోట విన్నా జగన్‌కే ఓటు వేస్తాం అనే నినాదం వినిపిస్తోంది.
– పి.కోదండరామ, అప్పన్నపాలెం 

Advertisement
Advertisement