రాజధానికి 12,500 ఎకరాలు | Sakshi
Sakshi News home page

రాజధానికి 12,500 ఎకరాలు

Published Sun, Aug 10 2014 1:06 AM

రాజధానికి 12,500 ఎకరాలు

రాజధాని సలహా కమిటీ భేటీ అనంతరం ఏపీ మంత్రి నారాయణ
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఏర్పాటుకు 4 వేల నుంచి 5 వేల హెక్టార్లు... అంటే 10 వేలనుంచి 12,500 ఎకరాల మేరకు భూములు అవసరముంటుందని రాజధాని సలహా కమిటీ అభిప్రాయపడింది. రాజధాని సలహా కమిటీ సభ్యులు శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. కమిటీ భేటీ అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఉండాలన్నది నిర్ణయిస్తూ శివరామకృష్ణన్ కమిటీ ఈ నెలలో నివేదిక ఇస్తుందని, ఈ నివేదిక అనంతరం కేబినెట్ ఆమోదానికి వెళుతుందని తెలిపారు. ఆ తర్వాత ఎలా నిర్మించాలనే దానిపై తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అసెంబ్లీ, సెక్రటేరియట్‌తో పాటు రోడ్లు, రవాణా సౌకర్యం, ఎయిర్‌పోర్టులు, నీళ్లు, తదితర అన్నీ అందుబాటులో ఉన్న ప్రాంతంలోనే రాజధాని ఉండేలా చూస్తామన్నారు. రాజధానికోసం ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు, ఫారెస్ట్ భూములు సేకరిస్తామని, ఇవన్నీ పూర్తయ్యాకే ప్రైవేటు భూముల గురించి ఆలోచిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లాలను సైతం ఆదేశించామని చెప్పారు.

 ‘‘రాజధాని ఎలా నిర్మించాలన్నదానిపై ఆరు విదేశీ నగరాలు, దేశంలోని మరో నాలుగు నగరాలను పరిశీలిస్తాం.’ అని చెప్పారు.

Advertisement
Advertisement