తీర్మానం లేకుండా విడగొడతారా? | Sakshi
Sakshi News home page

తీర్మానం లేకుండా విడగొడతారా?

Published Mon, Jan 6 2014 12:58 AM

తీర్మానం లేకుండా విడగొడతారా? - Sakshi

 సమైక్య శంఖారావంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్న
 రాష్ట్ర విభజనను దేశం మొత్తం అన్యాయం అంటున్నా కిరణ్, చంద్రబాబుకు పట్టదా?
 సోనియా గీసిన గీతను కిరణ్ దాటడం లేదు.. సమైక్యం పేరుతో మోసం చేస్తున్నారు
 ఓట్ల కోసం చంద్రబాబు వారితో కుమ్మక్కయ్యారు
 నీళ్ల కోసం రైతులు, ఉద్యోగాల కోసం యువత నిలదీస్తే వారికి ఏం సమాధానం చెబుతారు?
 చంద్రబాబూ.. మీ నోటి నుంచి సమైక్యం అన్న మాట ఎందుకు రాదు?
 ఎన్టీఆర్ పథకాలను తుంగలో తొక్కి.. ఇప్పుడు దొంగ హామీలు ఇస్తున్నారు
 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
 ‘‘అసెంబ్లీ తీర్మానం లేకున్నా రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. ఇది అన్యాయం అని రాష్ట్రమే కాదు.. యావత్తు దేశం అంటోంది. అసెంబ్లీ తీర్మానం లేకుండానే ప్రజలను విడగొట్టడం ఎంత వరకు న్యాయం?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓట్లు, సీట్ల కోసం వారితో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. రైతన్నకు నీళ్లు లేకపోయినా, చదువుకున్న యువతకు ఉద్యోగాలు దొరక్కపోయినా అన్యాయం అనిపించదా అంటూ చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే.. ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉండగానే పై రాష్ట్రాల్లో ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండితేనేగానీ మన రాష్ట్రానికి చుక్కనీరు రాని పరిస్థితి ఉందని, ఇక మధ్యలో మరో రాష్ట్రాన్ని పెడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుందని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం మూడో విడత మొదటి రోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. బీ కొత్తకోట మండల కేంద్రం, అంగళ్లు గ్రామంలో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను  ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...
 
 గీత దాటని కిరణ్.. సమైక్యం అనని బాబు..
 ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం, కొడుకును ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడం కోసం సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొడుతుంటే... ఆమె గీసిన గీత దాటకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి మనల్ని మోసం చేస్తున్నారు. సోనియాను నిలదీయాల్సిన చంద్రబాబు వాళ్లతోనే కుమ్మక్కయ్యారు. చంద్రబాబుగారూ.. మీ నోట్లో నుంచి సమైక్యం అన్న మాట ఎందుకు రావడం లేదు? మనందరం టీవీలో అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం. ఆ సమావేశాల్లో చంద్రబాబు ఏం చేస్తున్నారంటే.. సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలతో సమైక్యం అనిపిస్తాడు. తెలంగాణ ఎమ్మెల్యేల చేత విడగొట్టండి అనిపిస్తాడు. చంద్రబాబూ.. ఈ గడ్డ మీద పుట్టినందుకు మీకు నిజంగా ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉందా? రాజకీయాల్లో నిజాయితీ అన్న పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని సోనియా అనుకున్న వెంటనే... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీఎం కిరణ్ ఎందుకు తీర్మానం చేయలేదు? దేశ చరిత్రలోనే ఎప్పుడూ, ఎక్కడా జరగనంత అన్యాయం ఇవాళ రాష్ట్రానికి జరుగుతోంది. కనీవినీ ఎరుగని విధంగా అసెంబ్లీ తీర్మానం అనేది లేకుండా ప్రజలను విడగొడుతున్నారు. ఈ అన్యాయాన్ని దేశంలోని ప్రతి పార్టీ ఖండిస్తోంది. దేశంలోని ప్రతి నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి, చంద్రబాబుకు ఇది కనబడడం లేదు.
 
 విశ్వసనీయతకు అర్థం తెలియని బాబు..
 కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన మామనే వెన్నుపోటు పొడిచిన ఘనత ఈ దేశంలో ఎవరికైనా ఉందీ అంటే అది ఒక్క చంద్రబాబుకే. ఇప్పుడు ఆయన ఎన్నికలు వస్తున్నాయని దొంగ హామీలు ఇస్తూ బయలుదేరాడు. అది కూడా సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి. చంద్రబాబూ.. ఎన్నికలు వస్తున్నాయని హామీలిస్తున్నావు.. మీ మామ ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం ఇస్తే ఏం చేశావు? దాన్ని రూ 5.25కి పెంచింది మీరు కాదా? మద్యపానం  నిషేధిస్తామని ఎన్నికలకు వెళ్లి.. ముఖ్యమంత్రిగా కాగానే మద్యపానం నిషేధిస్తే రాష్ట్రమంతా అధోగతి పాలవుతుందని, ఖజానా దివాలా తీస్తుందని ఈనాడు పత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించుకుంది మీరు కాదా? ఆ తర్వాత గ్రామగ్రామానా బెల్టు షాపులు పెట్టించి మద్యం పారించింది మీరు కాదా?  కరెంటు బిల్లులు వసూలు చేయడా ని ప్రత్యేక పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు పెట్టించింది మీరు కాదా? రైతుల మీద అఘాయిత్యాలు చేయించారు. ఆ అఘాయిత్యాలను భరించలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అవహేళన చేసి మాట్లాడింది మీరు, మీ పార్టీ కాదా? ఉచిత కరెంటు ఇస్తే తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని వెటకారం చేయలేదా? వ్యవసాయ విద్యుత్ హార్స్ పవర్‌కు రూ.50 ఉన్న దాన్ని రూ.625కు పెంచింది మీరు కాదా? విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు. ఆయన ఒక్క రూపాయి ఇస్తాన న్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే జగన్‌మోహన్‌రెడ్డి రూ.50 ఇస్తానని చెప్పినా ప్రజలంతా హర్షధ్వానాలతో నమ్మే పరిస్థితి ఉంది. కారణం చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలించినప్పుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేసి కనీసం 10 పైసలు కూడా ప్రజలకు మేలు చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబుకు లేనిది, జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నది ఏమిటీ అంటే అది విశ్వసనీయత అని గట్టిగా చెప్పగలను’’.
 
 యాత్ర సాగిందిలా..
 ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి గౌనిపల్లె మీదుగా రాష్ట్ర సరిహద్దులోని ఠాణా గ్రామానికి చేరుకున్న జగన్‌కు ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. కర్ణాటకలోని పలు గ్రామాల్లో జనం రహదారుల పైకి వేచి ఉండడంతో యాత్ర ఆలస్యమైంది. ఉదయం పది గంటలకు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట చేరుకోవాల్సిన ఆయన మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు వచ్చారు. తొలుత శంకరాపురంలో సుబహాన్ సాహెబ్ కుటుంబాన్ని ఓదార్చి, ఆ గ్రామ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం బి.కొత్తకోటలో ప్రసంగించారు. తర్వాత నాయనబావి, ఉలవలవారిపల్లె, గట్టులో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సాయంత్రం అంగళ్లులో జరిగిన సభలో మాట్లాడారు. తర్వాత కురబలకోటకు చేరుకుని రోడ్ షో నిర్వహించారు. తిరిగి అంగళ్లుకు చేరుకుని స్థానిక నేత రమణారెడ్డి ఇంట్లో బసచేశారు. జగన్ వెంట పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
 జైల్లో ఉండీ పోరాడాను..
 
 ‘‘జగన్ జైల్లో ఉండి కూడా... రాష్ట్రాన్ని విడగొడుతున్న కాంగ్రెస్ పెద్దలతో పోరాటం చేశాడు. కానీ ఈ చంద్రబాబు బయటే ఉండి కూడా కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే కుమ్మక్కు రాజకీయాల గురించి మాట్లాడుతూ దిక్కుమాలిన అబద్ధాలు చెప్తున్నారు. ఎమ్మార్ అనే సంస్థకు హైదరాబాద్ నడిబొడ్డున పప్పుబెల్లాల మాదిరి చంద్రబాబు ఏకంగా 530 ఎకరాలు కేటాయించినా అది సీబీఐకి కనిపించదు. ఐఎంజీ భారత అనే సంస్థకు హైదరాబాద్‌లో ఎకరా కాదు, రెండు ఎకరాలు కాదు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఏకంగా 830 ఎకరాల భూమిని కట్టబెట్టినా సీబీఐకి కనిపించదు. దీనిపై విచారణ చేయమని హైకోర్టు అడిగినా ఇదే సీబీఐ ఆయనకు కనీసం నోటీసు కూడా ఇవ్వదు. ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి? ఎవరిని తప్పించాలి. రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలి? ఎలా విడగొడితే ఎన్ని ఓట్లు వస్తాయనే దిక్కుమాలిన ఆలోచనతో కనిపిస్తున్నాయి. ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతున్న సోనియాకు, ఈ చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్తున్నా.. మీరు చేస్తున్న మోసం ఊరికే పోదు, పై నుంచి దేవుడు అనే వాడు చూస్తున్నాడు. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మనందరం  ఒక్కటవుదాం. 30 ఎంపీ స్థానాలను తెచ్చుకుందాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఆ కోటను మనమే పునఃనిర్మిద్దాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, ప్రతీ ప్రాజెక్టుకు కూడా నీళ్లు తెచ్చుకుందాం.’’
 

Advertisement
Advertisement