Sakshi News home page

రేషన్‌కార్డులతో పరేషాన్

Published Thu, Jan 7 2016 12:18 AM

Needs training with ration cards

మంజూరైనా ప్రింటింగ్ కాని వైనం
కొత్తకార్డులకూ వస్తువులు ఇస్తామంటూ ప్రభుత్వ ప్రకటన
డీలర్ల చుట్టూ కార్డుదారుల ప్రదక్షిణలు

 
విజయవాడ  రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జారీచేసే రేషన్ కార్డులు ఒక ప్రహసనంగా మారింది. గతంలో తెల్లకార్డులు ఉండగా ప్రస్తుతం కొత్తగా ఇచ్చే కార్డుల రంగు మార్చేసి పచ్చకార్డులతో ప్రభుత్వం జారీచేస్తోంది. గతంలో జరిగిన జన్మభూమిలో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా, వాటిని ఇప్పుడు మంజూరు చేస్తున్నారు. కార్డుల రంగు మార్చడంపై ప్రభుత్వం చూపించిన శ్రద్ధ పేదలకు కొత్తకార్డులు మంజూరు చేయడంలో చూపించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

నగరంలో 22వేల కార్డులు...
గత జన్మభూమిలో నగరంలో 28,480 మంది కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో సుమారు 19,500 పచ్చకార్డులు మంజూరయ్యాయి. ఇందులో డివిజన్-1లో 10,200 కార్డులు మంజూరు కాగా, డివిజన్-2 పరిధిలో 9,300 కార్డులు మంజూరయ్యాయి. ఈ కార్డులను జన్మభూమిలో పేదలకు ఇస్తున్నారంటే తప్పులో కాలేసినట్లే. ప్రభుత్వం సకాలంలో మంజూరు చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, కంప్యూటర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల నగరంలో కేవలం 13000 కార్డులు ప్రింటిం గ్ కు వచ్చాయి. మిగిలిన 6,500 కార్డులు ఇం కా ప్రింటిం గ్‌కు నోచుకోలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో పరిస్థితి మరింత అయోమయంగా ఉంది. కార్డులు మంజూరైనట్లు జాబితాలు వచ్చినా కార్డులు రాకపోవడంతో ప్రజలకు సకాలంలో పచ్చకార్డులు అందచేయలేకపోతున్నారు. ప్రతి రోజూ జరిగే జన్మభూమి కార్యక్రమంలో కార్డులు మంజూరైన వారి పేర్లు చదివినా అందరికీ కార్డులు రాలేదని తరువాత ఇస్తామంటూ అధికారులు సర్ది చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. కార్డు కోసం డీలర్ల చుట్టూ,  సివిల్‌సప్లయీస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని పేదలు వాపోతున్నారు.
 
ప్రభుత్వ ఆర్భాటం
పేద ప్రజలందరికీ కార్డులు కాపోయినప్పటికీ కొత్త కార్డుదారులకు కూడా రేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కార్డులు రానివారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తమ పేరు లిస్టులో చదివారని, తమకు మాత్రం కార్డు ఇవ్వడం లేదని, డీలరు సూచన మేరకు  కార్డు కోసం సివిల్ సప్లయీస్ కార్యాలయానికి వచ్చానని కృష్ణలంకకు చెందిన ఒక మహిళ సాక్షికి తెలిపింది.
 
తప్పుల తడకలు
కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు లబ్ధిదారులకు కుటుంబసభ్యులందరితో ఫొటోను, పేర్లు, వివరాలు ఇవ్వమని సూచించారు. అధికారులు కోరినట్లే కుటుంబసభ్యులందరితో కలిపిన ఫొటోలు ఇచ్చారు. ప్రస్తుతం అనేక కార్డులలో ఫొటోలో నలుగురు ఉంటే ఒకరిద్దరి పేర్లు మాత్రమే వస్తున్నాయని కార్డు దారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పేర్లు నమోదు కావడం లేదు. కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఫొటోలో నలుగురు ఉన్నట్లు చూపితే.. కార్డులో ఇద్దరి పేర్లు మాత్రమే ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రేషన్ డిపో పరిధిలోనూ కనీసం నలుగురైదుగురికి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సింగ్‌నగర్, పాయకాపురంలో ఫొటోలు లేకుండా కార్డులు వస్తున్నాయని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఆధార్ నెంబర్లు సరిగా సరిపోల్చక పోవడం, ఆధార్ కార్డుల జిరాక్స్‌లు సరిగా ఇవ్వకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement