నీరు-చెట్టు..కాసులు పట్టు | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టు..కాసులు పట్టు

Published Wed, May 6 2015 4:15 AM

neeru chettu program corruption

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కోర్టులో కేసులున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కడ మట్టి తవ్వకానికి అనుగుణంగా ఉంటే అక్కడ తవ్వేసి అమ్మేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. నీరు- చెట్టు కార్యక్రమం వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. చెరువుల్లో పూడిక తీసి, మొక్కలు నాటడం లక్ష్యంగా ప్రారంభమైన నీరు -చెట్టు పథకం రోజురోజుకూ తెలుగుతమ్ముళ్లు జేబులు నింపే పథకంగా మారిపోతోంది. దీనికి అధికారులు కూడా వంతపాడటం వివాదాలకు దారితీస్తోంది. ఐదేళ్లుగా అది అటవీ భూమి అని ఆ శాఖ... కాదని రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోండగా, ఆ భూమిని క్వారీ లీజుకు తీసుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదం కోర్టులో ఇంకా సాగుతుండగానే తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టును అడ్డం పెట్టుకుని ఆ భూమిలో తవ్వకాలు మొదలు పెట్టారు.
 
వివరాల్లోకి వెళ్తే....
మార్టూరు మండలం నాగరాజుపల్లి  కొండ వద్ద సర్వే నంబర్ 475/పిలో రోడ్డు గ్రావెల్ క్వారీ కోసం అదే గ్రామానికి చెందిన వేల్పుల వీరయ్య  గనులు, భూగర్భ శాఖ వద్ద 2009లో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత తహశీల్దార్, సర్వేయర్, ఆర్‌ఐ వచ్చి తనిఖీ చేసి గనుల శాఖకు నిరభ్యంతర పత్రం ఇచ్చారు. ఆ తర్వాత గనుల శాఖ  డిప్యూటీ డెరైక్టర్ ఐదేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అంగీకరించారు. సెక్యూరిటీ డిపాజిట్లు, లీజ్ రెంట్ అన్నీ చెల్లించాలని వీరయ్యకు లేఖ పంపారు. అయితే వీటిని చెల్లించడంలో జాప్యం జరిగింది. తర్వాత తనకు పొడిగింపు కావాలని వీరయ్య కోరిన మీదట అధికారులు అంగీకరించి అన్ని ఫీజులు కట్టించుకున్నారు. అయితే క్వారీ మాత్రం వీరయ్యకు అప్పగించలేదు.

అటవీ శాఖ నుంచి అనుమతి తెచ్చుకోవాలని చెప్పారు. అటవీ శాఖ అధికారులు క్వారీలో తమ స్థలం ఉందా లేదా అన్న విషయం సర్వే చేసి చెబుతామన్నారు. అయితే ఈ నాగరాజుపల్లి కొండ మొత్తం అటవీ శాఖ పరిధిలోనే ఉందని అటవీ శాఖ అధికారులు వాదిస్తుండగా, రెవెన్యూ అధికారులు మాత్రం లేదని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2011లోనే లీజుదారుడు వీరయ్య తనకు క్వారీ అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. 2013 ఏప్రిల్ ఎనిమిదో తేదీ  కలెక్టర్ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వుల మేరకు అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి హద్దులు నిర్ణయించారు. దీనిపై ఇంకా హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది.
 
ఈ లోగా నీరు-చెట్టు పథకం కింద పక్కనే ఉన్న ఇసుకదర్శి గ్రామంలో నీటిగుంతలలో పూడిక తీయడం కోసం అనుమతులు తీసుకున్న తెలుగుదేశం నాయకులు కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో తవ్వకాలు మొదలు పెట్టారు. పూడిక తీయడం బదులు, మట్టిని తవ్వి హైవే పనుల కోసం అమ్మేసుకుంటున్నారు. ఈ విషయంపై లీజుదారుడు అధికారులను ఆశ్రయించినా వారు తామేం చేయలేమని చేతులెత్తేయడంతో బాధితుడు కోర్టు ధిక్కారం కింద పిటీషన్ వేయడానికి సన్నద్ధం అవుతున్నాడు.

Advertisement
Advertisement