ఎన్నాళ్లీ ఘోరాలు ! | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ఘోరాలు !

Published Wed, Oct 10 2018 3:04 PM

Negligence In Constructions - Sakshi

గుంటూరు, తుళ్లూరు: అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తున్నామంటూ గొప్పులు చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం రాజధాని వాసులు భద్రత విషయం మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఐదు నెలల కిందట ఏప్రిల్‌ 28న దొండపాడులో భారీ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సమయంలో ఇకనుంచి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న స్థానిక ఎమ్మెల్యే, సీఆర్‌డీఏ అధికారుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఇందుకు సోమవారం శాఖమూరు గ్రామంలో జరిగినే ప్రమాదమే ఉదాహరణ. రహదారి మలుపు వద్ద 20 అడుగలు భారీ కల్వర్టు తవ్వి నాలుగు నెలల పాటు నిర్లక్ష్యంగా వదిలేశారంటే ప్రమాదాల నివారణకు ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాజధానికి భూములు ఇస్తే.. మాకు పరిహారంగా ఇచ్చేది కడుపుకోతలా అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రాణాలు తోడేస్తున్న గుంతలు
రహదారుల కోసం గుంతలు తీస్తే వాటి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి, ఓ కాపాలదారుని పెట్టాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ రాజధాని నిర్మాణ సంస్థలు రహదారుల కోసం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వేసి.. అలా నిర్లక్ష్యంగా వదిలేస్తుండడంతో వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్మాణ సంస్థలకు చెందిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం పోలీసులు, అధికారులే స్వయంగా చెబుతున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

ప్రమాదం జరిగినప్పుడే హడావుడి
ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికార యంత్రాగం హడావుడి చేస్తుంది.నిర్మాణ సంస్థల వద్ద నుంచి అధికారులు రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని మేనేజ్‌ చేయడంలో ఉన్నంత చిత్తశుద్ధి ప్రమాదాలు నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో లేదని పలువురు విమర్శిస్తున్నారు. నిర్మాణ సంస్థలకు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నోటీసులు ఇస్తున్నారే తప్ప.. వాటిని అమలు చేస్తున్నారో లేదో అనేది నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవు అంటున్నారు.

నిర్మాణ సంస్థలు పాటించాల్సిననిబంధనలు ఇవే..
రహదారి నిర్మాణంలో ఉంటే వర్క్‌ ఇన్‌ ప్రొగ్రెస్‌ అనే బోర్డులు ఉంచాలి.
రెడ్‌ కలర్‌ రిబ్బన్స్‌ సంబంధిత నిర్మాణ స్థలంలో విధిగా ఏర్పాటు చేయాలి.
డేంజర్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి.
రహదారి సైట్‌ ఇంజినీర్‌ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలి.
కొత్త రహదారిలో సైడ్‌ మార్జిన్స్‌ కనపడేలా రేడియం స్టిక్కరింగ్‌ ఏర్పాటు చేయాలి.
రహదారుల కోసం గుంతలు తీస్తే వాటి చుట్టూ ఫెన్సింగ్‌ వేయాలి.
భారీ ఎత్తున బారికేడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
గుంతలో వర్షపు నీరు చేరితే వెంటనే నీటిని మళ్లించాలి.
సంబంధింత రహదారి సంస్థ కాపలాదారున్ని నియమించి ప్రాణాపాయం సంభవించకుండా చూడాలి.

Advertisement
Advertisement