పోస్ట్మేన్ నిర్లక్ష్యం ఖరీదెంత? | Sakshi
Sakshi News home page

పోస్ట్మేన్ నిర్లక్ష్యం ఖరీదెంత?

Published Wed, Feb 18 2015 2:39 AM

పోస్ట్ మేన్ బట్వాడా చేయకుండా వదిలివేసిన కవర్లలో తమకు వచ్చినవాటిని వెతుక్కుంటున్న గ్రామస్తులు - Sakshi

చిత్తూరు: జీవితంలో చాలా మందికి తమ గ్రామ, తమ ప్రాంత పోస్ట్ మేన్ గుర్తు ఉంటాడు. ఎందుకంటే అతను అన్ని రకాల సమాచారాలు మనకు చేరవేస్తుంటాడు. ఇంటర్వ్యూ లెటర్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు, ప్రేమలేఖలు, శుభకార్యాలతోపాటు అశుభకార్యాల సమాచారం చేరవేస్తుంటాడు. పోస్ట్ మేన్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడినది. అటువంటి పోస్ట్ మేన్ నిర్లక్ష్యం వహిస్తే, ఆ నిర్లక్ష్యం ఖరీదు ఎంత? ఆ ఖరీదు చెప్పడం సాధ్యంకాదు.
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామ పరిధిలోని రామకృష్ణాపురం పంచాయతీ  పోస్ట్ మేన్ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది జీవితాలు చిందరవందర అయ్యాయి. ఆధార్ కార్డులు - బ్యాంకు చెక్కులు, డిడిలు - ఇంటర్వ్యూ లెటర్లు - అపాయింట్మెంట్ ఆర్డర్లు, లేఖలు.....ఇలా అన్నిటి బట్వాడా నిలిచిపోయింది. దాదాపు మూడేళ్లుగా గ్రామస్తులకు ఎటువంటి సమాచారం అందలేదు. పోస్ట్మేన్ నిర్లక్ష్యం వల్ల ఈ గ్రామస్తులు ప్రజలు  తీవ్రంగా నష్టపోయారు.

 రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన పోస్ట్‌మేన్ గత మూడేళ్లుగా వచ్చిన సమాచారాన్ని గాలికొదిలేశాడు.   ఒకటేమిటి అన్నీ రకాల ముఖ్యమైన సమాచారాన్ని గమ్యస్థానానికి చేర్చకుండా దాచేశాడు. గోనె సంచిలో వేసి మిద్దపై పడేశాడు. దీంతో అవి ఎండకు ఎండి, వానకు తడిసి పనికిరాకుండా పోయాయి. అనుకోకుండా అవి నిన్నబయటపడడంతో విషయం వెలుగుచూసింది. వందలాదిగా గ్రామస్తులు వచ్చి తమకొచ్చిన లేఖలను, కవర్లను ఏరుకున్నారు. విధి నిర్వహణ పట్ల అడ్డగోలుగా వ్యవహరించి, తమకు అన్యాయం చేసిన పోస్ట్‌మ్యాన్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆధార్ కార్డులేక చాలా మందికి పెన్షన్ మంజూరుకాలేదని తెలిపారు. చాలా మంది యువకులకు ఉపాధికి సంబంధించిన లేఖలు అందక వారు చాలా నష్టపోయారని తెలిపారు.

Advertisement
Advertisement