కడుపులో కత్తెరపెట్టి కుట్టేశారు! | Sakshi
Sakshi News home page

కడుపులో కత్తెరపెట్టి కుట్టేశారు!

Published Sun, Nov 24 2013 11:33 AM

కడుపులో కత్తెరపెట్టి కుట్టేశారు!

రోగి కడుపులో గోవా వైద్యులు కత్తెరను పోలిన పరికరాన్ని మరిచిపోయారు. దీనిని కేజీహెచ్ వైద్యులు రెండు రోజుల క్రితం శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. 8 నెలల తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పుచ్చపాడుకు చెందిన పాలవలస మోహనరావు (55) ప్లంబింగ్ పనులు చేసుకుంటూ విశాఖలో నివాసముంటున్నాడు. 2012 సెప్టెంబర్‌లో పనులకోసం గోవాకు వెళ్లాడు. అక్కడ ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన పొట్టకు గాయమైంది. అతడ్ని గోవాలోని బాంబోలిన్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.


వైద్యులు ఏప్రిల్ 3న శస్త్రచికిత్స నిర్వహించారు. మోహనరావుకు ఈనెల మొదటివారంలో కడుపునొప్పి రావడంతో గోవా నుంచి విశాఖకు బయలుదేరాడు. గురువారం  కేజీహెచ్‌కు వచ్చాడు. ఎక్స్‌రే తీయగా  కడుపులో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసర శస్త్రచికిత్సను నిర్వహించి కడుపులోవున్న పరికరాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం మోహనరావు కోలుకుంటున్నాడు. శస్త్రచికిత్స అనంతరం తన భర్త కడుపునుంచి వెలికితీసిన కత్తెరను చూపించడానికి వైద్యులు నిరాకరించారని మోహనరావు భార్య మీనాక్షి ఆరోపించారు. కనీసం ఎక్స్‌రేని ఇవ్వాలని కోరినప్పటికీ ఇది ఎంఎల్‌సీ కేసని, వీటిని కోర్టుకు మాత్రమే అందజేస్తామని వైద్యులు చెప్పారన్నారు.


కత్తెరను పోలిన ఫోర్‌సెప్స్
శస్త్రచికిత్స చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో రక్తస్రావానికి అడ్డుకట్ట వేసేందుకు రెండు రకాల ఫోర్‌సెప్స్‌లను సాధారణంగా సర్జన్లు ఉపయోగిస్తారు. మోహనరావుకు గోవా వైద్యులు శస్త్రచికిత్స చేసే సమయంలో కర్వడ్ ఆర్టరీ ఫోర్‌సెప్స్‌ను ఉపయోగించారు. శస్త్రచికిత్స అనంతం కుట్లు వేసే సమయంలో వాటిని తొలగించాల్సి ఉండగా పొరపాటున ఒకదాన్ని తొలగించడం మరచిపోయారు. ఈ విషయాన్ని నర్సులు కూడా గమనించకపోవడం తప్పే. మోహనరావు పేగులన్నీ ఫోర్‌సెప్స్‌కు మెలతపడి ముద్దగా తయారయ్యాయి.  దీనివల్ల పేగులు దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమించింది. పేగులు చుట్టూ పాడైన మాంసాన్ని తొలగించి కుట్లు వేశాం. 72 గంటలైతే తప్ప పరిస్థితి చెప్పలేం. ఆపరేషన్ అనంతరం అతని పొట్ట నుంచి తీసిన ఆరు అంగుళాల  ఫోర్‌సెప్స్, ఎక్స్‌రేను భద్రపరిచాం.
 -డాక్టర్ సిహెచ్. స్వామినాయుడు

Advertisement
Advertisement