పాలకుల నిర్లక్ష్య ఫలితమే రైతుల ఆత్మహత్యలు | Sakshi
Sakshi News home page

పాలకుల నిర్లక్ష్య ఫలితమే రైతుల ఆత్మహత్యలు

Published Sun, Sep 13 2015 2:09 AM

పాలకుల నిర్లక్ష్య ఫలితమే రైతుల ఆత్మహత్యలు - Sakshi

చుంచు శేషయ్య, మారెళ్ల బంగారుబాబు
ఒంగోలు టూటౌన్ :
పాలకుల నిర్లక్ష్యమే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని వర్జీనియా పొగాకు రైతుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చుంచు శేషయ్య, మారెళ్ల బంగారుబాబు పేర్కొన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానిక రంగా భవనంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సంఘం నాయకులు మండిపడ్డారు. తొలుత సంఘం గౌరవ అధ్యక్షులు చుండూరి రంగారావు మాట్లాడుతూ గిట్టుబాటు ధరల కోసం ముఖ్యమంత్రికి, మంత్రులకు, కేంద్ర మంత్రికి విన్నవించినా ఫలితం లేదని, అందువల్లనే నేడు రైతులు ఆత్మహత్యలకు కారణమవుతోందని తెలిపారు.

పొగాకు సంక్షోభంలో పడినప్పుడల్లా గత పాలకులు కేంద్రం, ఎస్‌టీసీని రంగంలో దించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయిస్తే నేడు పాలకులు రైతులను విస్మరిస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో శుక్రవారం పురుగుమందు తాగి మరణించిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  సంఘం అధ్యక్షులు చుంచు శేషయ్య మాట్లాడుతూ జులై 4న విజయవాడలో జరిగిన పొగాకు రైతుల సమావేశంలో నిర్ణయించిన ధరలు నేటికి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న బోర్డు చైర్మన్ వెంటనే తప్పుకోవాలని సంఘం కార్యదర్శి మారెళ్ళ బంగారు బాబు డిమాండ్ చేశారు.  గిట్టుబాటు ధరలు రాక రోజుకి ప్రతి ప్లాట్ ఫాం నుంచి 400 బేళ్ళవరకు రైతులు వెనక్కు తీసుకెళ్తున్నారని వివరించారు. రైతులను వ్యాపారులు దోపిడికి వదిలేశారని మండిపడ్డారు. బోర్డు ఎస్‌టీసీని రంగంలోకి దించి పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.
 
రైతు కుటుంబానికి రూ.50 వేల సహాయం
టంగుటూరు మండలం పొందూరు గ్రామ పంచాయతీకి చెందిన మృతుడు బొల్లినేని కృష్ణారావు కుటుంబానికి సంఘం తరఫున రూ.50 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయాన్ని ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు చుంచు శేషయ్య తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, మనోనిబ్బరంతో బతకాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement