ఉప్పల్ చేపట్టెన్ పగ్గాల్ | Sakshi
Sakshi News home page

ఉప్పల్ చేపట్టెన్ పగ్గాల్

Published Tue, Jul 15 2014 2:55 AM

ఉప్పల్ చేపట్టెన్ పగ్గాల్ - Sakshi

శ్రీకాకుళం సిటీ: ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చిత్తశుద్ధి తో కృషి చేస్తానని కొత్త కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం ఉదయం 8.49 గంటలకు జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సహజసిద్ధమైన వనరులు పుష్కలంగా ఉన్న జిల్లాలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్త రాష్ట్రంతో సమానంగా ఈ జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్నారు. అధికారులందరూ బాధ్యతతో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. సామాన్యులకు సరైన న్యాయం జరగడం లేదని, గ్రీవెన్స్ ద్వారా అర్జీలే మిగులుతున్నాయన్న ఆరోపణలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉపాధి అవకాశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు.
 
 పెట్రేగిపోతున్న ఇసుక మాఫియాను అరికట్టే విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడతానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పా రు. అందరికీ అందుబాటులో ఉంటానని, ఎవరైనా, ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చునని అన్నారు. ఆ వెంటనే ఆయన  కలెక్టరేట్ ఆవరణ లో పలు విభాగాలను పరిశీలించారు. ముందుగా గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లి అర్జీదారులతో మాట్లాడారు. అక్కడ సిబ్బంది పనితీరును పరిశీలించారు. పౌరసరఫరాల ఆన్‌లైన్ కౌంటర్, ఆరోగ్య మిత్ర కౌంటర్, ఐటి విభాగం పనితీరును పరిశీలించారు. రోజువారీ కార్యక్రమాలు, గ్రీవెన్స్‌డే రోజు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉదయం ఉమారుద్ర కోటేశ్వరాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు జరిపారు. పాత కలెక్టర్ సౌరభ్‌గౌర్‌తో కాసేపు మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, ఏజేసీ షరీఫ్‌లు ఆయనతో ఉన్నారు. కలెక్టరేట్‌లోని ముఖ్య విభాగాల అధిపతులను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్  పరిచయం చేసుకున్నారు.
 

Advertisement
Advertisement