అదే చుక్క.. అదే కిక్కు | Sakshi
Sakshi News home page

అదే చుక్క.. అదే కిక్కు

Published Tue, Jun 23 2015 8:57 AM

అదే చుక్క.. అదే కిక్కు - Sakshi

‘కొత్తసీసా.. పాత సారా’ చందంగా నూతన మద్యం పాలసీ
షాపుల కాలపరిమితి ఏడాది నుంచి రెండేళ్లకు పెంపు
కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రేవరీల ఏర్పాటు
మెడికల్ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జిల్లాకో డీ-ఎడిక్షన్ సెంటర్

 
గుంటూరు: ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీని పరిశీలిస్తే ‘ కొత్త సీసాలో పాత సారా’ అన్న చందంగా కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు తమిళనాడు, కర్ణాటక తరహా మద్యం విధానాన్ని తెస్తామని చెపుతూ వచ్చిన ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక అధికార పార్టీకి చెందిన మద్యం సిండికేట్ల ఒత్తిడి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మద్యం విధానం మేరకు ఇక పల్లెల్లో మద్యం ఏరులై పారనుంది. గతంలో ఐదు శ్లాబ్‌లుగా విభజించి మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజులు నిర్ణయించగా,  ఈసారి ఏడు శ్లాబ్‌లకు పెంచి లెసైన్స్ ఫీజులు నిర్ణయించారు.

గతంలో మాదిరిగానే లాటరీ విధానంలో షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత ఏడాది షాపు దక్కించుకున్న వారికి ఒక్క సంవత్సరం మాత్ర మే సమయం ఉండేది, ఈ సారి కాలపరిమితిని రెండేళ్లకు పెంచింది. ప్రతి కార్పొరేషన్ పరిధిలో మైక్రోబ్రేవరీలు ఏర్పాటుకు వీలుంటుంది. ఇది తెలుగు తమ్ముళ్లకు వరంగా మారనుందని భావిస్తున్నారు. లెసైన్స్ దుకాణాలను బట్టి 10 శాతం వరకు ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ప్రభుత్వం 34 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారకుండా ఉండేలా ప్రతి మూడు దుకాణాల మధ్య ప్రభుత్వం ఓ మద్యం దుకాణం ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

మరో వైపు ప్రతి జిల్లా కేంద్రంలో మద్యానికి బానిసలు అయ్యే వారి కోసం మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ తరఫున ఉచిత డీ-ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 342 మద్యం దుకాణాలు ఉండగా, ప్రస్తుతం అందులో 250 దుకాణాల వరకు అధికార పార్టీ నేతలకు చెందినవి కావడం, మిగతా వాటిని కూడా నయానో భయానో తమ సొంతం చేసుకుని మద్యం సిండికేట్ల హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

గత ఏడాది ఇందులో 29 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, తెనాలి పట్టణాల్లోని మద్యం డిపోల వద్ద ప్రభుత్వ అవుట్‌లెట్లు పెట్టి మద్యం విక్రయాలు జరపాల్సి ఉండగా, మద్యం సిండికేట్ దారుల ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తెరిచిన దాఖలాలు లేవు. మూడు దుకాణాలను తెరవలేని ఎక్సైజ్ అధికారులు జిల్లాలో 34  ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎలా నడపగలరో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement