కొత్త పరిశ్రమలతోనే రాష్ట్రాభివృద్ధి | Sakshi
Sakshi News home page

కొత్త పరిశ్రమలతోనే రాష్ట్రాభివృద్ధి

Published Wed, Dec 17 2014 1:10 AM

New Industrial  state development

కాకినాడ బాలాజీచెరువు/అమలాపురం :‘వ్యవసాయ పునాదులపై ఆధారపడ్డ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలి. అందుకు వ్యవసాయరంగం లోనే కాదు.. పాడి, మత్స్య పరిశ్రమలు, అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావాలి. ఆయా రంగాల్లో కొత్త పరిశ్రమలు రావాలి. ఇందుకు యువత పారిశ్రామికవేత్తలుగా మారాలి’ అని జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. జేఎన్‌టీయూకే, గోదావరి నాలెడ్జ్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీలో జరుగుతున్న మూడురోజుల బయోఆంధ్రా - 2014 అగ్రికల్చర్, మెరైన్ అండ్ ఫార్మా బయోటెక్నాలజీ అంతర్జాతీయ సదస్సులో రెండోరోజైన మంగళవారం వివిధ దేశాల శాస్త్రవేత్తలు, ఆయా రంగాల  నిపుణులు ప్రసంగించారు.
 
 తొలి రోజు ప్రారంభోత్సవం ఆలస్యం కావడం వల్ల అంతగా జరగని శాస్త్రవేత్తలు, నిపుణుల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్  రెండోరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విఘ్నంగా సాగింది. యూకే, యూఎస్‌ఏ, రష్యా, ఫ్రాన్స్ దేశాల నుంచి బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, మెరైన్ రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సదస్సులో ఇప్పటి వరకు 30 మంది ఆయా రంగాల్లో వస్తున్న పరిణామాలు, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, నానోటెక్నాలజీతో ఆవిష్కృతమవుతున్న అద్భుత పరిశోధనలను వివరించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆయా రంగాల్లో ఎదురవుతున్న ప్రధాన సమస్యలను తెలిపారు. వాటి పరిష్కారంపై యువత సూచనలు చేయాలన్నారు. నిరంతర అన్వేషణతో కొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా యువత దేశ భవిష్యత్‌ను మార్చవచ్చన్నారు. సుమారు 970 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండడం రాష్ట్రం అదృష్టమని విదేశీ శాస్త్రవేత్తలు తెలిపారు.
 
 విశాఖ- కాకినాడ పెట్రోలియం కారిడార్ వల్ల  మరిన్ని పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశముందన్నారు. ఇక్కడ దొరికే కొన్ని రకాల మత్స్యసంపద ఔషధాల తయారీలో కీలకమని, వీటి ఉత్పత్తిని పెంచే విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు. యువ పారిశ్రామికవేత్తలకు ఈ సదస్సు ఎంతో మేలు చేస్తుందన్నారు. రెండో రోజు సదస్సులో సెర్జీ క్లైకోవ్, ఐగోర్ (రష్యా), డాక్టర్ రంగారావు అంబేట్ (మలేషియా), ఎ.ఎస్.పన్నాల (యు.కె.), ఉడుప (మణిపాల్), కృష్ణా సుధారాణి (నొయిడా) వంటి ప్రముఖులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి వీసీ ప్రభాకరరావు, గోదావరి నాలెడ్జ్ సొసైటీ అధ్యక్షుడు ఎన్.గోపాలకృష్ణ, కార్యదర్శి శంకరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement