Sakshi News home page

Published Wed, Mar 7 2018 3:06 AM

News about special status of ap  - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి :  ‘‘ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి బృందం ఢిల్లీకి పోయి హోదా గురించి అడిగితే అది సాధ్యం కాదని కేంద్రం చెప్పింది. దాంతో రాష్ట్రంలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులంతా ఇక కేంద్రంతో తెగతెంపులు చేసుకోవాలని అంటున్నారు.’’ ఇవీ రోజంతా ఎల్లో మీడియాలో బ్రేకింగ్‌ కథనాలు. అసలు అరుణ్‌జైట్లీని టీడీపీ బృందం హోదా గురించి అడిగిందా.. అడిగితే ఆయనేమన్నారు..? బీజేపీతో తెగతెంపులకు టీడీఎల్పీలో ఓటింగ్‌ జరిగిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలనే మీడియాకు లీక్‌ ఇచ్చారా? అసలు ఈ పరిణామాల వెనక ఉన్నదేమిటి? తాను చేసిన పాపాలన్నిటినీ బీజేపీ ఖాతాకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రయత్నిస్తున్నారు.. అందులో భాగమే ఈ పరిణామాలు.. మీడియాకు లీకులు.. అని విశ్లేషకులంటున్నారు.

కమీషన్ల కక్కుర్తితో అడిగి తీసుకున్న పోలవరం నిధుల కోసం, ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికి పోయిన ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడడం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్న సంగతి తెల్సిందేనని విమర్శకులంటున్నారు. ఇపుడు ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని రాష్ట్రమంతా ముక్తకంఠంతో నినదిస్తుండడంతో తన ఇన్నాళ్ల వైఫల్యాలను, తన తప్పులను, తన పాపాలను అన్నిటినీ కేంద్రం ఖాతాలోకి తోసేసి బయటపడడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. మంగళవారం హస్తినలో అరుణ్‌జైట్లీ వద్దకు టీడీపీ బృందం ఉత్తుత్తి రాయబారం.... అమరావతిలో టీడీఎల్పీ భేటీలో ‘తెగతెంపుల’పై ఉత్తుత్తి పోలింగ్‌... ఇవన్నీ ఆ నాటకంలోని ప్రత్యేక అంకాలు మాత్రమే..

జైట్లీ దగ్గర ‘మౌన’మే మీ భాష..
ప్రత్యేక హోదా కోసం ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో.. సీఎం మార్గ‘దర్శకత్వం’లో.. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ కె.రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కుటుంబరావులతో కూడిన టీడీపీ బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసింది. అయితే అక్కడ జైట్లీ ప్రశ్నలు.. జవాబులకు తెలుగుదేశం నేతలు మౌనమే తమ భాష అన్నట్లు నీళ్లు నమిలారు.

టీడీపీ బృందం: జైట్లీజీ ప్రత్యేక హోదా గురించి ప్రజల్లో డిమాండ్లు పెరుగుతున్నాయి..
అరుణ్‌జైట్లీ: అదేంటి ప్రత్యేక హోదా అవసరం లేదు.. ప్యాకేజీ సరిపోతుంది అన్నది మీరే కదా.. మళ్లీ ఇపుడు ఇదేంటి?
టీడీపీ బృందం  మౌనం
టీడీపీ బృందం: జైట్లీజీ పన్ను రాయితీలు ఇస్తే బాగుంటుంది..
అరుణ్‌జైట్లీ: పన్ను రాయితీలు ఇస్తే పొరుగు రాష్ట్రాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ ఎంపీ వీరప్పమొయిలీ నేతృత్వంలో ఆర్థిక అంశాలపై వేసిన పార్ల మెంటరీ స్టాండింగ్‌ కమిటీ కూడా వ్యతి రేకించింది. అందువల్ల ఇచ్చే అవకాశం లేదు..
దాంతో టీడీపీ బృందం మళ్లీ మౌనం
కాసేపటి తర్వాత అరుణ్‌జైట్లీయే చొరవ తీసుకుని రాజధాని అమరావతికి ఇచ్చిన నిధుల ఖర్చుల గురించి, వివిధ ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చుల గురించి గుచ్చిగుచ్చి అడిగారు. దానిని టీడీపీ బృందం నుంచి సమాధానమే లేదు.
అరుణ్‌జైట్లీ: కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలపై జవాబు చెప్పకపోవడానికి, జాప్యం చేస్తుండడానికి కారణాలు ఏమిటి?
టీడీపీ బృందం: మా నాయకుడు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత వివరాలు అందిస్తాం. అని బయటకు వచ్చేశారు.  జరిగిందిదీ.. కేంద్రం వద్దకు రాయబారానికి పోయినవాళ్లు గట్టిగా అడగాలి కదా.. అలా కాకుండా తమ పాపాలన్నీ కడుగుకునే ప్రయత్నం కనిపించింది.
కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకే..
మరోవైపు అమరావతిలో జరిగిన తెలుగుదేశం లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో కూడా అదే తరహా నాటకాలతో అధినేత చంద్రబాబు నాయుడు రక్తికట్టించేందుకు ప్రయత్నిం చారు. బీజేపీతో తెగతెంపులు చేసేసుకుందామని 95శాతం మంది  చెప్పేసినట్లు లీకులు ప్రచారం చేయడం అందులో భాగమేనని విశ్లేషకులంటున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం, కమీషన్లకోసం నాలుగేళ్లపాటు నాటకాలాడి ఇక జనంలో దోషిగా నిలబడే సమయం వచ్చేయడంతో తనకు సంబంధం లేనట్లు.. బీజేపీయే ఇవ్వడం లేదన్నట్లు అటువైపు తోసేసి బయటపడడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమౌతున్నదని వారు పేర్కొంటున్నారు.

నిజానికి ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడడానికే చంద్రబాబు కేంద్రానికి సాగిలపడ్డారన్నది బహిరంగ రహస్యం. పోలవరం నిర్మాణం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ ఆ బాధ్యతను కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు తలకెత్తుకున్నారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీయడానికి ఓటుకు కోట్లు కేసు అడ్డం వచ్చింది. ఆ తర్వాత కాపులను బీసీల్లో చేరుస్తానని, బోయలను ఎస్టీలలో చేరుస్తానని అసెంబ్లీలలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించిన చంద్రబాబుకు వాస్తవానికి అవి ఆ పద్ధతులలో నెరవేరవని తెలుసు. కానీ వాటికి కూడా కేంద్రాన్నే దోషిగా నిలబెట్టేందుకే ఉపయోగించుకుంటున్నారని వినిపిస్తోంది.

తెగతెంపులు.. ఓటింగుల లీకులు..
వెలగపూడి అసెంబ్లీ కమిటీ హాలులో మంగళవారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేపీతో పొత్తుపై చర్చ జరిగిందని, ఈ అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ఓటింగ్‌ నిర్వహించారని మీడియాకు ఉప్పందించారు. ఎమ్మెల్యేల ముందు మూడు ప్రశ్నలు ఉంచిన బాబు.. వాటికి చేతులెత్తి అభిప్రాయాలు చెప్పాలని కోరారని, బీజేపీతో పొత్తు కొనసాగించాలా.. వద్దా? వద్దంటే వెంటనే తెగదెంçపులు చేసుకుందామా? పోరాటం కొనసాగిస్తూ కొద్దికాలం వేచిచూద్దామా? అని ప్రశ్నించారని సమాచారం.

సమావేశంలో పాల్గొన్న 95 శాతానికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే తెగదెంపులు చేసుకుందామని చేతులెత్తి స్పష్టం చేసినట్లు తెలిసింది. కేవలం ఐదారుగురు సభ్యులే వేచిచూద్దామని అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రం నుంచి విడిపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయని, పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని, ఇతరత్రా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారట.

అయినా కూడా బీజేపీతో పొత్తు వద్దని, ఇబ్బందులు వస్తే ఎదుర్కోవడమే మంచిదని సభ్యులంతా స్పష్టంచేశారని, ఇందుకు చంద్రబాబు బదులిస్తూ.. ఆవేశంగా నిర్ణయం తీసుకోకూడదని, రెండు, మూడు రోజుల్లో దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని అన్నట్లు తెలిసింది. గతంలో జరిగిన వాటి గురించి మరచిపోవాలని, హోదాయే మన విధానమని, దాని గురించి అందరూ గట్టిగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారట. బీజేపీ తీరును ప్రజలకు తెలపాలని, రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

Advertisement
Advertisement