నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల జైలు | Sakshi
Sakshi News home page

నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల జైలు

Published Tue, Feb 18 2014 1:00 AM

నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల జైలు

గాజువాక, న్యూస్‌లైన్ : లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయని యువతిని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 అపరాధ రుసుం విధిస్తూ మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.దత్తాత్రేయులు సోమవారం తీర్పు చెప్పారు. మిలియన్ పౌండ్లు లాటరీలో వచ్చాయని 47వ వార్డు ములగాడ హౌసింగ్‌కాలనీకి చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని లండా రమాదేవికి నైజీరియాకు చెందిన ఫ్రిడో అంబ్రోస్ గత ఏడాది మేలో సెల్‌ఫోన్ ద్వారా సమాచారం పంపించాడు.

ఆమె వారిని ఫోన్‌లో సంప్రదించగా ఆ డబ్బును విడుదల చేయడం కోసం రూ.21 వేలు అవసరమని అకౌంట్ నంబర్ ద్వారా వసూలు చేశాడు. లాటరీ డబ్బు అధిక మొత్తంలో ఉందని దాన్ని ఇండియన్ కరెన్సీకి మార్చడం కోసం అదనంగా రూ.2.10 లక్షలు చెల్లించాలని మరో అకౌంట్ నంబర్ ఇచ్చాడు. ఆమె అదే రోజు రూ.50 వేలు, మరుసటిరోజు రూ.1.60 లక్షలు వేరొక అకౌంట్ నంబర్‌కు పంపింది. మళ్లీ రూ.9 లక్షలు చెల్లించాలని యువతికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు.

విసుగెత్తిన యువతి తనకు లాటరీ సొమ్ము వద్దని, తాను చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటే కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పాడు. తాను బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నానని, ఇంటికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పడంతో అతడు జూన్ 12న ఇంటికి వచ్చాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న కుటుంబ సభ్యులు అతడిని బంధించి గాజువాక పోలీసులకు అప్పగించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. కేసును సైబర్ క్రైమ్ సీఐ వెంకటేశ్వరరావు విచారించగా, నకిలీ పాస్‌పోర్టుపై అతడు భారత్‌కు వచ్చినట్టు నిర్ధారించారు. ప్రాసిక్యూషన్ వాదనలు అనంతరం నిందితునికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలపల్లి ఆదినారాయణ కేసు వాదించారు.
 

Advertisement
Advertisement