దారిపొడవునా..నీరా‘జనం’ | Sakshi
Sakshi News home page

దారిపొడవునా..నీరా‘జనం’

Published Sat, Feb 28 2015 2:47 AM

Nirajanam

సాక్షి ప్రతినిధి, నెల్లూరు  : ఎన్నికల సమయం కాదు.. బహిరంగ సభలు లేవు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగడుగునా నీరాజనం పలికారు. పువ్వులు చల్లి ఘనస్వాగతం పలికారు. ‘జై జగన్’ అంటూ నినదించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె హైందవి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నెల్లూరుకు వచ్చారు. ఆయన రాకను తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, విద్యార్థులు దారిపొడవునా వైఎస్ జగన్ కోసం వేచిచూడటం కనిపించింది.
 
  నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్, డిప్యుటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ వేకువజామునే 30 వాహనాల్లో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో జిల్లా సరిహద్దు ప్రాంతంలో స్వాగతం పలికేందుకు తరలివెళ్లారు. వీరంతా పెళ్లకూరు మండలం చవటకండ్రిగ క్రాస్ వద్దకు చేరుకుని వైఎస్ జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
 
  జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో కార్పొరేటర్లు రవిచంద్ర, రాజశేఖర్, మాధవయ్య, నాగరాజు, ఖలీల్‌అహ్మద్, అశోక్, యువజన, విద్యార్థి విభాగం నాయకులు గంధం సుధీర్‌బాబు, సత్యకృష్ణ తదితరులు ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డికి నాయుడుపేటు గోమతి సెంటర్ వద్ద సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో పాలూరు దశరథరామిరెడ్డి, వెంకటరమణారెడ్డిలు భారీఎత్తున స్వాగతం పలికారు.  చుట్టపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకుని కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. తన కోసం వచ్చిన వారందరినీ ‘బాగున్నావా అవ్వా.. బాగున్వావా తాతా.. బాగున్నావా చెల్లెమ్మా.. బాగున్నావా తమ్ముడు’ అంటూ పలుకరిస్తూ ముందుకు కదిలారు.
 
 పోటుపాళెం కూడలిలో పొటెత్తిన జనం
 గూడూరు సమీపంలోని పోటుపాళెం కూడలిలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వృద్ధులు, మహిళలు పెద్దఎత్తున జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. జనం పువ్వులు చేతబట్టుకుని వేచి ఉండటం కనిపించింది. ఆయన కూడలికి చేరుకోగానే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, పువ్వులు చల్లి తన అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక నాయకులను ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ పరిచయం చేశారు. పెద్దఎత్తున జనం తరలిరావటంతో పొటుపాళెం కూడలి దాటుకుని రావటానికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. అక్కడి నుంచి నేరుగా వెంకటాచలం మీదుగా నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు.
 
  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న వేలాదిమంది జనం పెద్దఎత్తున ‘వైఎస్ జగన్.. జిందాబాద్. జై జగన్’ అంటూ నినాదాలు చేయటం కనిపించింది. జగన్‌ను చూసేందుకు భారీగా జనం కాన్వాయ్ చుట్టూ గుమికూడారు. కొంత సమయం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సిబ్బంది, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ సహాయంతో వాహనం నుంచి వివాహ వేదికకు చేరుకున్నారు. మండపంలో ఉన్న వేలాదిమంది జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేసేందుకు ఎగబడటం కనిపించింది.
 
 నేరుగా వివాహ వేదికపైకి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. వివాహానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జెడ్పీ చెర్మైన్ బొమ్మిరెడ్డి రాఘవేందరరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సీఈసీ సభ్యులు నేదురమల్లి పద్మనాభరెడ్డిని పలుకరించారు.
 
  జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌లో చిత్తూరు జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి వచ్చారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి పయనమయ్యారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ వెంటవెళ్లారు.
 

Advertisement
Advertisement