మళ్లీ మొక్కుబడిగానే.. | Sakshi
Sakshi News home page

మళ్లీ మొక్కుబడిగానే..

Published Fri, Aug 21 2015 3:13 AM

మళ్లీ మొక్కుబడిగానే.. - Sakshi

- మారని ఐటీడీఏ పాలకవర్గ సమావేశం తీరు
- గిరిజనుల సమస్యలపై ఎప్పటిలాగే కొరవడ్డ చర్చ
- కీలకశాఖల ప్రస్తావన లేకుండానే ముగిసిన భేటీ
- బహిష్కరించిన ఎమ్మెల్యే రాజేశ్వరి, మరికొందరు
రంపచోడవరం :
గిరిజనాభ్యున్నతికి కీలక వేదికైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)  పాలకవర్గ సమావేశం.. ఎప్పటిలాగే గిరిజనుల సమస్యలు, వారి ప్రగతికి అవసరమైన చర్యలపై చర్చ లేకుండానే తూతూ మంత్రంగా ముగిసింది. 9 నెలల తర్వాత జరిగిన సమావేశాన్ని కీలక శాఖల ప్రస్తావన లేకుండానే ముగించారు. హాజరవుతారని భావించిన గిరిజన సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు రానేలేదు. ఐటీడీఏ సమావేశపుహాలులో గురువారం కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్
 
హెచ్. అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశానికి జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు,ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ టి.రత్నాబాయి హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్ సర్దుబాటు సమాధానాలతోనే సమావేశాన్ని మూడున్నర గంటల్లో మొక్కుబడిగా ముగించారు. గిరిజన సంక్షేమ విద్యావిభాగం, వైద్య,ఆరోగ్యశాఖలపై జరిగిన చర్చలో ఆ శాఖల అధికారులు సరైన సమాధానాలు చెప్పలేకపోవటంతో కలెక్టర్, జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. తొలుత సమావేశాల నిష్ర్పయోజకత్వాన్ని దుయ్యబడుతూ, స్వాతంత్య్ర దినం నాడు తనకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ జిల్లాలోని ఏకైక గిరిజన ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సమావేశం మొదలైన కొద్దిసేపటికే మరి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశాన్ని బహిష్కరించారు.
 
అవకతవకల ఊసే లేదు..
గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్, జీసీసీ, మైనర్ ఇరిగేషన్, గృహనిర్మాణ, వ్యవసాయ శాఖలు, సహాయపునరావాస పథకం, మత్స్య, వాటర్‌షెడ్ వంటి పలుశాఖలపై చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు. గిరిజన సంక్షేమశాఖలో కోట్లాది రూపాయలతో పనులు చేస్తున్నారు. ఇటీవల పీఓ రివ్యూలో ఇంజనీరింగ్ పనులకు దేవీపట్నం మండలంలోని ఇసుక రీచ్‌లో కొద్దిగా మాత్రమే వాడారని వెల్లడించారు. అంచనాల్లో గోదావరి ఇసుకను చూపుతూ పనుకు కాలవ ఇసుకను వినియోగిస్తున్నారన్నారు. అడ్వాన్సుల పేరుతో లక్షలాది రూపాయల సొమ్ము ఇంజనీర్ల వద్ద ఉండిపోయింది. ఇలాంటి అనేక అంశాలపై చర్చ లేకుండానే సమావేశం ముగించారు. వాటర్ షెడ్ పథకంలో ఏమి జరుగుతుందో సభ దృష్టికి రానేలేదు. ప్రాజెక్ట్‌ల నిర్మాణం కారణంగా నిర్వాసితులై న గిరిజనుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. పునరావాసకాలనీలో సమస్యలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల ఇబ్బందులు వారిని వెంటాడుతున్నాయి. గృహనిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయూరుు.
 
గిరిజన సదస్సులే మేలు : రత్నాబాయి
నేషనల్ పార్క్ కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరపవద్దని, కాలువ ఇసుక దొరికే ప్రాంతాల్ని గుర్తించి అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ సమావేశంలో తెలిపారు. ఐతే నేషనల్ పార్క్ కారణంగా సుమారు 30 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు నిర్వాసితులవుతున్నారుు. కొన్ని గ్రామాలను నేషనల్ పార్క్ పరిధిలో గుర్తించకపోరుునా అక్కడ గిరిజనులు ఎటువంటి అటవీ ఉత్పత్తులు సేకరించవద్దని వైల్డ్‌లైఫ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ఇటువంటి ప్రధాన సమస్యలను గుర్తించి, వారికి న్యాయం చేయకపోవటం ఐటీడీఏ సమావేశం తీరుకు అద్దం పడుతుంది. ఏజెన్సీలో ప్రధాన సమస్యల పరిష్కారానికి గిరిజన సదస్సులే మేలని ఎమ్మెల్సీ రత్నాబాయి అభిప్రాయపడ్డారు. తాగునీటిని గ్రామాలకు అందించటంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు.
 
‘సబ్‌ప్లాన్’ గిరిజనులను గాలికొదిలేశారు : వరుపుల
ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుబ్బారావు మాట్లాడుతూ..సబ్‌ప్లాన్ ప్రాంతంలో గిరిజనుల సమస్యలను, గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  సబ్‌ప్లాన్ మండలాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధే తప్ప ఈ ఏడాది కాలంగా అభివృద్ధి జరగలేదన్నారు. వీటిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చాలామంది గిరిజనులకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు కాక మధ్యలోనే విద్యకు స్వస్తి చెపుతున్నారన్నారు.

పెదమాల్లాపురం కేంద్రంగా ప్రత్యేక గిరిజన సదస్సును ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో ఏజెన్సీ గ్రామాల  సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. 11 మండలాలను మైదాన ప్రాంతాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రతినెలా మూడవ గురువారం జిల్లా స్థాయి సమావేశాన్ని రంపచోడవరంలో నిర్వహిస్తామన్నారు. కొద్ది కాలంలోనే గిరిజన మండలాల్లో సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను నియమిస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పాలకవర్గ సమావేశాన్ని ప్రతి మూడునెలలకొకసారి నిర్వహించేలా కలెక్టర్, పీఓ కృషిచేయాలన్నారు. సమావేశంలో పీఓ చక్రధరబాబు, ఆర్డీఓలు సత్యవాణి, నర్శింహమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement