సీఎం సహాయనిధికి చెక్కుల్లేవ్! | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి చెక్కుల్లేవ్!

Published Thu, Sep 12 2013 2:17 AM

No Cheques for Chief Minister's Relief Fund

రెండు నెలలుగా ఆగిన సాయం
 సాక్షి, హైదరాబాద్: చెక్ బుక్కులు (చెక్కులు) లేని కారణంగా రెండు నెలలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) కార్యకలాపాలు స్తంభించాయి. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సీఎంఆర్‌ఎఫ్ వితరణ ఆగిపోయింది. దీంతో నిధి నుంచి ఆర్థికసాయం మంజూరైన ఆపన్నులు చెక్కుల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆర్థికసాయం మంజూరు చేస్తూ సీఎం సంతకాలు చేసిన 1,600పైగా దరఖాస్తులు చెక్కులు లేని కారణంగా పెండింగులో ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
 
  వైద్యం, ఇతరత్రా అత్యవసర ఆర్థిక సాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలు ప్రతిరోజూ సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం అందించాలంటూ సీఎం కార్యాలయానికి విజ్ఞప్తులు చేస్తుంటారు. ప్రజాప్రతినిధుల సిఫా ర్సు లేఖలతో  ముఖ్యమంత్రి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం కోసం దరఖాస్తులు వస్తుంటాయి. వ్యాధి బారినపడి అప్పో సప్పో చేసి వైద్యం చేయించుకున్న వారే ఇలా దరఖాస్తు చేసిన వారిలో అత్యధిక మంది. వీటిని పరిశీలించి వితరణకు అనుమతిస్తూ సీఎం సంతకం చేయగానే ఆ వివరాలను సీఎంఆర్‌ఎఫ్‌కు పంపుతారు. వీటి ఆధారంగా లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ సిబ్బంది చెక్కులు జారీ చేస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎంత బిజీగా ఉన్నా రోజూ తప్పనిసరిగా   దరఖాస్తులను పరిశీలించేవారు.
 
 చెక్కుల్లేక: రెండు నెలలుగా చెక్కుల జారీ కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది. దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
 
రెండు నెలలుగా చెక్కులు లేనందున వితరణ కార్యక్రమం ఆగిపోయిన విషయం వాస్తవమేనని వారు అంగీకరిస్తున్నారు. ‘కమిషనర్ స్టేషనరీ అండ్ ప్రింటింగ్‌కు  చెక్‌బుక్కులు ముద్రించి ఇవ్వాలని మేం చాలా కాలం కిందటే ఇండెంట్ పెట్టాం. అయితే వారి నుంచి చెక్ బుక్కులు రాలేదు. కమిషనర్ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ అధికారులు నిధుల లేమివల్ల ముద్రించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిపారు. దీంతో మేం సీఎం కార్యాలయానికి తెలియజేసి రూ. 75 వేలు నిధులు విడుదల చేయించాం. 25,000 చెక్కుల కోసం ఆర్డర్ ఇచ్చాం. వారం రోజుల్లో చెక్కులు వస్తాయి.  తర్వాత చెక్కులు జారీ చేస్తాం. అప్పటి వరకూ సమస్య తప్పదు..’ అని సీఎంఆర్‌ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement