రుణమాఫీ మరింత జాప్యమా? | Sakshi
Sakshi News home page

రుణమాఫీ మరింత జాప్యమా?

Published Fri, Jul 25 2014 2:57 AM

no clarity on a schedule

 కర్నూలు(అగ్రికల్చర్) :  రుణ మాఫీ మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత వరకు దీనిపై ఎల్‌డీఎం(లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్)కు గాని, ఇతర బ్యాంకులకు గాని ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. అలాగే గతేడాది తీసుకున్న పంట రుణాలను రీ షెడ్యూల్ చేయడానికి రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి వచ్చింది అంటూ ప్రకటనలు చేస్తున్నా.. ఆదేశాలు మాత్రం బ్యాంకులకు రాలేదు.

 కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు రుణ మాఫీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారు, మాఫీ చేస్తే మొత్తం బ్యాంకులకు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. రుణ మాఫీని మరింత జాప్యం చేయడానికి అన్నట్లు నిధుల సమీకరణకు మరో కమిటీ వేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఖరీఫ్ పంట రుణాల పంపిణీని బ్యాంకులు పూర్తిగా పక్కన బెట్టాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి జిల్లాలో పంట రుణాలు 4,02,952 అకౌంట్లకు సంబంధించి రూ.2560.47 కోట్లు, అలాగే బంగారంపై వ్యవసాయ రుణాలు 1,21,086 ఖాతాలకు సంబంధించి రూ.1042.83 కోట్లు బకాయిలుగా ఉండిపోయాయి.

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రైతులు పంట రుణాలు చెల్లించడం లేదు. అన్ని రకాల వ్యవసాయ రుణాలు, మహిళల డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టమైన హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబు తర్వాత మాఫీకి తూట్లు పొడవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నించారు. అధికారం చేపట్టింది మొదలు రుణమాఫీపై జాప్యం చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి ఇటీవల కుటుంబానికి రూ.1.50 లక్షలు, డ్వాక్రా సంఘానికి రూ.లక్ష ప్రకారం మాత్రమే మాఫీ చేస్తామంటూ ప్రకటించారు. ఈ ప్రకటనపై ఒకవైపు రైతులు, మరోవైపు పొదుపు మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి రుణ మాఫీ చేయాలని పోరుబాట పట్టారు.

 రీషెడ్యూల్‌తో అన్నదాతకు భారమే.. రుణ మాఫీని జాప్యం చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రీషెడ్యుల్ వైపు మొగ్గు చూపుతున్నారనే విమర్శలున్నాయి. రీ షెడ్యూల్ అంటే రైతులపై భారం మోపడమేనని బ్యాంకర్లే పేర్కొంటున్నారు. ఇప్పుడు బకాయి పడిన రుణాన్ని చెల్లించడాన్ని మూడేళ్ల పాటు వాయిదా వేయడమే రీ షెడ్యూల్. మూడేళ్ల తర్వాత వాయిదాల పద్ధతిలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంది. రీ షెడ్యూల్ చేసిన రోజు నుంచే 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. దీంతో వడ్డీ భారం పడుతుండటంతో రైతులు దీనికి ముందుకు వచ్చే పరిస్థితి లేదని బ్యాంకర్లే పేర్కొంటున్నారు.

 డీఫాల్టర్లుగా రైతులు.. రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి రైతులను డిఫాల్టర్లు(ఎగవేతదారులు)గా మార్చింది. గతేడాది ఖరీఫ్‌లో తీసుకున్న రునాలను మార్చిలోగా చెల్లించాల్సి ఉంది. అలా చెల్లించకపోయినా జూన్ వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ లోగా రుణాలు చెల్లిస్తే డీఫాల్టర్లుగా మారే అవకాశం ఉండదు. రుణమాఫీపై నాన్చివేత ధోరణి అవలంబిస్తుండటం, కుటుంబానికి రూ.1.50 లక్షలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా అది ఎప్పటి నుంచి అమలయ్యేది స్పష్టం చేయలేదు. దీంతో రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. ప్రభుత్వం వైఖరితో రైతులు ఇన్సెంటివ్‌లకు దూరమయ్యారు. ఇప్పుడు డీఫాల్టర్లుగా మిగిలారు.

 మార్గదర్శకాలు రాలేదు  - నరసింహరావు, ఎల్‌డీఎం
 రుణ మాఫీకి సంబంధించి ఇంతవరకు మార్గదర్శకాలు రాలేదు. శుక్రవారం రిజర్వు బ్యాంకు అధికారులు కర్నూలుకు వస్తున్నారు. కలెక్టర్ దగ్గర ప్రత్యేక సమావేశం ఉంది. అందులో రుణ మాఫీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రుణ మాఫీపై స్పష్టత లేనందున ఇంతవరకు జిల్లాలో పంట రుణాల పంపిణీ మొదలు కాలేదు.

Advertisement
Advertisement