రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదు: నరసింహన్ | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదు: నరసింహన్

Published Tue, Sep 16 2014 1:56 AM

రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదు: నరసింహన్ - Sakshi

9,10 షెడ్యూళ్లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్
  ఆ షెడ్యూళ్లపై మరింత స్పష్టత రావాల్సి ఉంది
  ఇద్దరు సీఎంలూ బాగా పనిచేస్తున్నారు
  కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, జవదేకర్‌లతో భేటీ
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఎలాంటి వివాదం లేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, దీనిని పరిష్కరిస్తామని అన్నారు. సోమవారం ఢిల్లీకి వచ్చిన ఆయన కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, ప్రకాశ్‌జవదేకర్‌లతో భేటీ అయ్యారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఇక్కడి రాజీవ్ భవన్‌లో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజుతో అరగంట పాటు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లోనూ పరిపాలన చాలా బాగుందని, రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సీఎంలూ మిషన్, విజన్‌తో ముందుకెళుతున్నారని కితాబిచ్చారు. త్వరలోనే రెండు రాష్ట్రాలూ అభివృద్ధిలో ముందుంటాయన్న విశ్వాసం ఉందని చెప్పారు. అశోక్‌గజపతిరాజుతో ఏం  చర్చించారో చెప్పడానికి ఆయన నిరాకరించారు. 
 
హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఏ పౌరుడికీ అభద్రత భావం లేదు. అదంతా మీడియా సృష్టి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు చాలా సురక్షితంగా ఉన్నారు’’ అని చెప్పారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాలపై గవర్నర్‌తో చర్చించినట్టు తెలిపారు. విభజన అనంతర సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవడం శుభసూచకమని అన్నారు. 
 
భవిష్యత్తులోనూ సమస్యల పరిష్కారానికి వారిద్దరూ మాట్లాడుకోవాలని చెప్పారు. అనంతరం గవర్నర్ నరసింహన్ కేంద్ర పర్యావరణ, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో రెండు చానళ్ల ప్రసారాల నిలిపివేత అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి గవర్నర్ నరసింహన్ ఏపీ భవన్‌లోని శబరి బ్లాక్‌లోనే గడిపారు. మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్‌కి తిరిగివెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement