పరువు కాలిపోయింది! | Sakshi
Sakshi News home page

పరువు కాలిపోయింది!

Published Fri, Nov 1 2013 2:48 AM

No facilities for burns ward

కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : రాయలసీమ జిల్లాలతోపాటు, బళ్లారి, నెల్లూరు జిల్లాలకు కర్నూలు ప్రభుత్వాసుపత్రి పెద్ద దిక్కు. అయితే ప్రభుత్వం ఈ ఆసుపత్రి అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలోని కాలిన రోగుల విభాగం సమస్యలతో సతమతమవుతోంది. ఇక్కడ రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వైద్యం అందక, మరోవైపు ఇన్‌ఫెక్షన్ రేటు పెరిగి, చావు ఎప్పుడొస్తుందా అని రోగులు ఎదురు చూసే దయనీయ పరిస్థితి దాపురించింది.  ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి అనుబంధంగా ఉన్న ఈ విభాగంలో సమస్యలు తాండవిస్తున్నాయి. 20 పడకలున్న ఈ విభాగంలో అవసరమైన వైద్యనిపుణులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ కొన్నేళ్లుగా ఒకే ప్రొఫెసర్  ఈ విభాగానికి సేవలందిస్తున్నారు. అవసరమైన వైద్యులను అందించకపోవడంతో ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగంలోనూ సర్జరీలు తగ్గిపోయాయి. సర్జరీ తర్వాత పర్యవేక్షణ చేసే వైద్యులు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.

గతంలో ఈ విభాగంలో పనిచేసిన ఓ వైద్యురాలు పదోన్నతి రావడంతో, ఇతర ప్రాంతానికి వెళ్లే ఇష్టం లేక దీర్ఘకాలిక సెలవు పెట్టారు.  కాలిన రోగుల వార్డులో ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువ. ఈ కారణంగా ఈ విభాగాన్ని పూర్తిగా ఆపరేషన్ థియేటర్ స్థాయిలో స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గతంలో దీనిని సెంట్రల్ ఏసీగా మార్చారు. అయితే నిర్వహణ లోపం కారణంగా తరచూ ఏసీ పనిచేయడం మానేస్తోంది. నాలుగు నెలలుగా ఏసీ పనిచేయకపోవడంతో ఉక్కపోత భరించలేక రోగులు సొంతంగా ఇళ్ల వద్ద నుంచి ఫ్యాన్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు. మంచాలు, వాటిపై పరుపులు, ఆయా రోగులుండే రూంలకు కర్టెన్లు లేకపోవడం ఈ విభాగం దయనీయ పరిస్థితిని చాటుతోంది.  ఈ కారణాలతో ఈ విభాగంలో ఇన్‌ఫెక్షన్ రేటు పెరుగుతోంది. రోగికి అవసరమైన మందులు, నాణ్యమైన చికిత్సనందించే వైద్యం అందించే వారు లేకపోవడంతో రోగుల మరణాల శాతం అధికంగా ఉంది. 35 శాతంపైగా కాలిన రోగులు ఈ విభాగంలో మరణించే శాతం అధికంగా ఉందని రోగుల కుటుంబీకులు చెబుతున్నారు. రోజూ మరణాలను చూడలేక కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన చికిత్సను భరించలేక ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇదే ఆసుపత్రిలో బిక్కుబిక్కుమంటూ వైద్యం అందుకుంటున్నారు. రోజుకో పూట వచ్చే వైద్యుడు సూచించే మందులను రోగులకు రాస్తూ ఎప్పుడెప్పుడు బయటపడదామన్న ఆలోచనతో కుటుంబీకులు ఇక్కడ కాలం వెల్లదీస్తున్నారు. ఈ విభాగంలో వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేద న్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement
Advertisement