బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు వద్దు | Sakshi
Sakshi News home page

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు వద్దు

Published Tue, Mar 10 2015 2:51 AM

No foreign investment in the insurance sector

ఒకరోజు సమ్మె చేసిన బీమా ఉద్యోగులు
 
కర్నూలు(జిల్లా పరిషత్): బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు వద్దని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కర్నూలు యూనిట్ కార్యదర్శి ఆర్. సునీల్‌కుమార్ చెప్పారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఇఏ) పిలుపు మేరకు సోమవారం బీమా ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేసి కర్నూలులోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లును అలాగే వదిలేసి లోక్‌సభలో ఇదే బిల్లును ప్రవేశపెట్టడం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేసే పని సరికాదన్నారు.

రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టాక అది పార్లమెంటు ఉమ్మడి ఆస్తి అవుతుందన్నారు. ఆమోదించడమో, తిరస్కరించడమో, ఉపసంహరించడమో సభ ఆమోదంతోనే జరగాలన్నారు. అదేమీ లేకుండా మరో సభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్దమని తెలిపారు. ఇప్పటి వరకు పార్లమెంటు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని విమర్శించారు. నిధుల లేమి వల్ల బీమా వ్యాపారం విస్తరించడం లేదని, నూతన సాంకేతిక పరిజ్ఞాన ం, నూతన ఉత్పత్తులు వస్తాయని ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందన్నారు.

ప్రైవేటు బీమారంగ సరళీకరణ వల్ల ఒరిగేదీ లేదని, దేశీయ ప్రైవేటు భాగస్వాముల వద్ద నిధుల కొరత ఏమీ లేదన్నారు. ఎందుకంటే దేశీయ బీమా కంపెనీల భాగస్వాములు(టాటా, బిర్లా, రిలియన్స్)వంటి కార్పొరేట్ దిగ్గజాలు అనేక దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని, ఇందులో భాగంగా ప్రైవేటు కంపెనీల సేవలపై ఫిర్యాదులు నానాటికీ మిన్నంటుతున్నాయని చెప్పారు. బీమా నియంత్రణ సంఘం(ఐఆర్‌డిఏ)కు రెండు లక్షలపై ఫిర్యాదులు వస్తున్నాయంటే ప్రైవేటు బీమా కంపెనీల పనితీరును మనం అర్థం చేసుకోవచ్చన్నారు.

పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడం, చిన్నమొత్తాల పొదుపును సమీకరించి, దేశ మౌళిక వనరుల కల్పనకు పెట్టుబడులుగా ఉపయోగించడంలో బీమా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు మక్బుల్ అహ్మద్, ఉపాధ్యక్షురాలు కె. నాగమణి, సెక్రటరి ఎం. అమీర్‌బాషా, ఎల్‌ఐసీ సీనియర్ బ్యాంక్ మేనేజర్ ఎన్. శంకర్‌నాయక్,  నాయకులు ఎ. ప్రతాప్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పుల్లారెడ్డి, రామాంజనేయులు, రాధాకృష్ణ, అంజిబాబు పాల్గొని ప్రసంగించారు.
 
సమ్మె విజయవంతం
ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 నుంచి 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలోని నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలైన యునెటైడ్ ఇండియా, న్యూ ఇండియా, ఓరియంటల్, నేషనల్ కంపెనీల్లో సమ్మె విజయవంతం అయింది. ఏఐఐఈఏ ఇచ్చిన సమ్మె పిలుపునకు స్పందించి స్థానిక ఓరియంటల్ ఇన్సూరెన్స్, భూపాల్ కాంప్లెక్స్‌లో జరిగిన సమ్మెలో జిల్లా కార్యదర్శి జి. శివకుమార్, ఉపాధ్యక్షులు జయశ్రీ, అజీజ్, రంగనాథరెడ్డి పాల్గొన్నారు. లాభాల బాటలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలను విదేశీయుల చేతుల్లోకి పోకుండా అందరూ పోరాడాలని వారు కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement