ప్రేమ‘కులం’.. ఏదీ ప్రోత్సాహకం | Sakshi
Sakshi News home page

ప్రేమ‘కులం’.. ఏదీ ప్రోత్సాహకం

Published Tue, Sep 9 2014 11:42 PM

ప్రేమ‘కులం’..  ఏదీ ప్రోత్సాహకం - Sakshi

కర్నూలు(అర్బన్): షెడ్యూల్డ్ కులాల స్త్రీ, పరుషులను ఇతర కులస్తులు వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రోత్సాహకం అందిస్తోంది. గతంలో రూ.10వేలు అందిస్తుండగా.. మే 12, 2011 తర్వాత రూ.50వేలకు పెంచారు. అయితే బడ్జెట్ విడుదలలో నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో కులాంతర వివాహంతో ఒక్కటైన జంటలకు నిరాశే ఎదురవుతోంది. గత మూడు సంవత్సరాలుగా అరకొర బడ్జెట్ విడుదల చేస్తుండటంతో ఎదురుచూపులు తప్పని పరిస్థితి నెలకొంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.8.10 లక్షలు విడుదల కాగా.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ ప్రకారం 41 జంటలకు ఈ మొత్తాన్ని అందజేశారు.
 
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.80 లక్షలు విడుదల కాగా ఆరు జంటలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం 100 పైగా జంటలు బడ్జెట్ కోసం నిరీక్షిస్తున్నారు. కొందరికి రూ.10వేలు, మరికొందరికి రూ.50వేలు చొప్పున మొత్తం రూ.50లక్షల ప్రోత్సాహకాన్ని అందజేయాల్సి ఉంది. ఈ విషయమై జిల్లా అధికారులు పలుమార్లు నివేదిక పంపగా.. గత జూలైలో రూ.56వేలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. విడుదల చేసిన మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు ఆప్షన్ లేకపోవడంతో అధికారులు కూడా చేతులెత్తేశారు. ఆ మొత్తం తీసుకునే అవకాశం కల్పిస్తే కనీసం ఐదు జంటలకైనా న్యాయం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మార్చిలో రూ.10.70 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. ట్రెజరీల్లో ఫ్రీజింగ్ కారణంగా నయాపైసా కూడా డ్రా చేసుకునే అవకాశం లేకపోయింది.
 
తాజాగా ఆ నిధుల ఊసే కరువైంది. మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న జంటలకు ఇప్పటికీ ప్రోత్సాహకం విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వంపై ఆశతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి స్పందిస్తూ బడ్జెట్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వివిధ పద్దుల కింద ఇప్పుడిప్పుడే నిధులు విడుదలవుతున్న దృష్ట్యా కులాంతర వివాహాలకు సంబంధించి ప్రోత్సాహకం కూడా త్వరలోనే రావచ్చన్నారు. బడ్జెట్‌కు అనుగుణంగా సీనియారిటీ ప్రకారం ప్రోత్సాహకం పంపిణీ చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement