ప్రోత్సాహకం కరువు | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహకం కరువు

Published Mon, Nov 4 2013 6:53 AM

no incentives from government

 నా పేరు బెయిరి సత్యనారాయణ. మాది మంచిర్యాల. డిగ్రీ వరకు చదువుకున్న. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. డిసెంబర్‌లో సకలాంగ యువతితో నాకు వివాహమైంది. ఆ సమయంలోనే ప్రభుత్వం ఇచ్చే వివాహ ప్రోత్సాహకం(రూ. 50 వేలు) కోసం దరఖాస్తు చేసుకున్న. ఇంతవరకు నాకు నయాపైసా రాలేదు. కుటుంబపోషణ భారం కావడంతో మంచిర్యాలలో మీ సేవ నిర్వహించుకుంటున్న. ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహకం తొందరగా ఇవ్వాలి.

 సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఆదర్శ వివాహం చేసుకున్న జంటలను ప్రభుత్వం నిరుత్సాహ పరుస్తోంది. వికలాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు ప్రోత్సాహకాల కింద రూ.50 వేలు ఇస్తామని విస్మరించింది. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 142 ఆదర్శ జంటలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 16 జంటలకే నగదు అందజేసి చే తులు దులుపుకుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల కోసం 126 మంది వికలాంగులు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

 

 నిరుత్సాహమే మిగిలింది..

 జిల్లా వ్యాప్తంగా ఆరు వేలకు పైగా వికలాంగులున్నారు. వీరిలో 3,900 వరకు వయోవృద్ధులు ఉన్నారు. మిగిలిన వారు విద్యార్థులు, యువతీయువకులు. సమాజంలో అంగవైకల్యం, మానసిక వికలాంగులపై కొనసాగుతున్న వివక్ష, చిన్నచూపును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని నిర్ణయించింది. ఎవరైన సకలాంగులు వికలాంగులను పెళ్లాడితే వారిని ఆదర్శ జంటలుగా పరిగణించి రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరమే మార్గదర్శకాలు విడుదల చేసింది.

 

 వివాహం జరిగినట్లు నిరూపించే పెళ్లి ఫొటోలు, వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్, గుర్తింపు కార్డు, తహశీల్దార్లు, గ్రామ కార్యదర్శులు ధ్రువీకరించే పత్రాలతో ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో రెండేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా 142 వికలాంగ జంటలు దరఖాస్తు చేసుకున్నాయి.

 

 కొందరికే ప్రోత్సాహకం

 వికలాంగులను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన యువ జంటలను కాదని కొందరికే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 22 జూలై, 2011 తర్వాత వివాహం చేసుకున్న జంటలే దరఖాస్తు చేసుకోవాలని, వారికి మాత్రమే ప్రోత్సాహక నగదు ఇస్తామని ప్రకటించడంతో అంతకు ముందు వివాహం చేసుకున్న జంటలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క.. దరఖాస్తు విధానంపై అవగాహన లేకపోవడంతో చాలా జంటలు దరఖాస్తు చేసుకోలేద. 142 జంటలకు రూ.71 లక్షలు విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం రూ. 8 లక్ష లు విడుదల చేసింది. ఇందులో 16 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. దీంతో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఆదర్శ జంటలు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు.

 

 ఇదిలావుంటే ఇప్పటి వరకు ఆదర్శ జంటలకు ప్రభుత్వం నేరుగా నగదు ఇచ్చింది. కానీ ఇక మీదట ప్రోత్సాహక నగదును ఆధార్ కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ప్రోత్సాహకాల పంపిణీలో జాప్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు త్వరగా అందజేస్తే మిగతా సకలాంగులనూ ప్రోత్సహించినట్లు ఉంటుంది.

 

 నిధులు విడుదల  కాకపోవడంతోనే..

 వికలాంగ వివాహ ప్రోత్సాహక నిధులు విడుదల కాకపోవడంతోనే ఆదర్శ జంటలకు నగదు ఇవ్వలేకపోతున్నాం. నిధులు విడుదల అయిన వెంటనే మిగతా అర్హులైన వారందరికీ అందజేస్తాం. అప్పటి వరకు ఆగాల్సిందే.

 - ఏవీడీ నారాయణరావు, అసిస్టెంట్ డెరైక్టర్, వికలాంగ సంక్షేమ శాఖ

 

Advertisement
Advertisement