ఇక మలేరియా మరణాలుండవు | Sakshi
Sakshi News home page

ఇక మలేరియా మరణాలుండవు

Published Thu, Jul 9 2015 1:29 AM

ఇక మలేరియా మరణాలుండవు

వారం రోజుల పాటు అవగాహన సదస్సులు
హైరిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు
ఐటీడీఏ పీవో హరినారాయణన్

 
అనంతగిరి: మన్యంలో ఇక ముందు మలేరియా మరణాలు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ఐటీడీఏ పీవో హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని భీమవరం పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎపిడిమిక్‌లో భాగంగా మలేరియా నియంత్రణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలను వివరించారు. రెండో విడతగా 1830 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేపడుతున్నామన్నారు. మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న గ్రామాల్లో మరోసారి స్పేయింగ్ చేపడతామన్నారు. హైరిస్క్ ప్రాంతాలైన దారకొండ, భీమవరం,గోమంగి పీహెచ్‌సీలకు జిల్లాకలెక్టర్ ప్రత్యేక వైద్యబృందాలను పంపార ని   తె లిపారు. మలేరియా నియంత్రణ ఒక్క అధికారుల వల్లే సాధ్యం కాదని, ప్రజలు సహకరించాలని కోరారు. పారిశుధ్యం మెరుగుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 10 ,13,16,20,23,27,30 తేదీల్లో అన్ని మండలాల్లో పారిశుధ్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. వీటిని మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తారన్నారు.

ఏది ఏమైనా ఇక ముందు మన్యంలో మలేరియా మరణాలు ఉండకూడదన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. అంతకు ముందు ఆయన గుమ్మకోట, గరుగుబిల్లి, భీమవరం, భీంపోలు,చిముడుపల్లి గ్రామాల్లో పర్యటించారు. జ్వరాల తీవ్రత అధికం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని డాక్టర్ కృష్ణమూర్తిని ఆదేశించారు. స్థానికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని భీమవరంలో డాక్టర్‌పై స్థానికులు ఫిర్యాదు చేయగా విధుల్లో ప్రజలతో సక్రమంగా మెలగాలని సూచించారు.

 అంగన్వాడీ కార్యకర్తలపై కొరడా: పర్యటనలో భాగంగా పీవో పలువురు అంగన్వాడీ కార్యకర్తలపై కొరడా ఝుళిపించారు. గరుగుబిల్లి అంగన్వాడీ కేంద్రంలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉండడంతో పాటు పౌష్టికాహారం పంపిణీపై కార్యకర్త సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మకోటలో పౌష్టికాహారం వండకపోవడం, భీంపోలులో కేంద్ర తెరవకపోవడంతో పాటు చిమిడిపల్లిలో కార్యకర్త అందుబాటులో లేకపోవడంతో  మండిపడ్డారు. చిమిడిపల్లి కార్యకర్తను సస్పెండ్ చేయాలని, మిగతావారి వేతనాలు నిలుపుదల చేయాలని ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీవో ఎస్ ఉమాను ఆదేశించారు. గుమ్మకోట గురుకుల పాఠశాల, భీంపోలు బాలికల పాఠశాలను పరిశీలించారు. గురుకులంలో మంచినీటి సమస్య, భీంపోలులోని సమస్యలను పరిష్కరించాలని ఆయా ఉపాధ్యాయులు పీవోను కోరారు. పీవో వెంట అరకులోయ ఎస్‌పీ హెచ్‌వో గురునాథరావు, ఎంపీటీసీ కొండమ్మ, సర్పంచ్ పైడితల్లి, చిన్నయ్య ఉన్నారు.
 

Advertisement
Advertisement