చిన్నారులకు పౌష్టికాహారమేదీ? | Sakshi
Sakshi News home page

చిన్నారులకు పౌష్టికాహారమేదీ?

Published Fri, Feb 28 2014 11:47 PM

no nutrition to children due to anganwadi bandh

 ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం అందజేసేవారు కరువయ్యారు. పదిహేను రోజులుగా సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహరానికి దూరమవుతున్నారు. జిల్లాలో 13 సమగ్ర సేవ, శిశు సంరక్షణ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 2,524 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరు సంవత్సరాల లోపు 50,000 మంది చిన్నారులకు రోజూ, అలాగే గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. మాతా శిశుమరణాలను తగ్గించి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణులు, బాలింతల కోసం ఉద్దేశించిన పౌష్టికాహారం పథకం సిబ్బంది సమ్మె కారణంగా నిల్చిపోయింది.

 అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు...
 గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గత నెల 17నుంచి అంగన్‌వాడీలు సమ్మెకు దిగారు. పన్నెండు రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసి ఆందోళన బాటపట్టారు. గర్భిణులకు, బాలిం తలకు కూడా ఆరు నెలల వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే పౌష్టికాహారం అందజేయాలి. రోజూ మధ్యాహ్నం వారికి అన్నం, పప్పు, ఆకుకూరలతో భోజనంతో పాటు గుడ్డు, పాలు అందించాలి. కాగా, ప్రస్తుతం నెలకు ఒకమారు వారికి పౌష్టికాహార పదార్థాలను ఇంటిదగ్గర వండుకోవడానికి అందజేస్తున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి పదార్థాలను అందజేసినా నిరవధిక సమ్మె కొనసాగుతున్నందున మార్చి మాసానికి పౌష్టికాహారం అందే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు.

 ప్రత్నామ్నాయమేది...
 పదిహేను రోజులుగా అంగన్‌వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె చేపట్టడంతో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడి చిన్నారులకు పౌష్టిక భోజనం అందడం లేదు. సమ్మె చేపడతామని నెల రోజుల ముందుగా సిబ్బంది నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించ లేదు.
 రోజూ అంగన్‌వాడీకేంద్రాలకు వస్తున్న నిరుపేదల పిల్లలు, మహిళలు తాళాలను చూసి ఉసూరంటూ వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించి ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement