అంధకారం | Sakshi
Sakshi News home page

అంధకారం

Published Tue, May 27 2014 12:54 AM

no power supply in district due to electricity employees in strike

 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాను చీకటి కమ్మేసింది. పీఆర్‌సీ అమలు చేయాలని కోరుతూ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఆందోళన సోమవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో ఉద్యోగులు అదే స్థాయిలో భీష్మించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయాన్నే విద్యుత్ భవన్‌కు తాళం వేశారు. విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాన్నీ మూసేశారు. సమ్మె కారణంగా జెన్‌కో సిబ్బంది విధులకు దూరంగా ఉండటంతో వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరులోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

 విజయవాడ, కొత్తగూడెం, ఇతర పవర్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి మందగించింది. సాధారణ రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద 11,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా.. సమ్మె కారణంగా ఆరు వేల మెగావాట్లకు పడిపోవడం గమనార్హం. ఫలితంగా జిల్లాలోనూ విద్యుత్ కష్టాలు చుట్టుముట్టాయి. మొత్తం 10.55 లక్షల మంది వినియోగదారుల అవసరాలకు రోజుకు 90.20 లక్షల యూనిట్లు అవసరం కాగా.. సమ్మె కారణంగా 25 లక్షల యూనిట్ల లోటు తలెత్తింది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచే కష్టాలు మొదలయ్యాయి. గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, నందికొట్కూరు తదితర సబ్ డివిజన్లలో రాత్రి 10 గంటల వరకు కోతలు విధించారు. అప్పటి నుంచి నంద్యాల డివిజన్‌లోని ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, ఆదోని డివిజన్లలోని గ్రామాలకు సరఫరా నిలిపేశారు.

 గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లోనూ నాలుగైదు గంటలకు పైగా కోత అమలైంది. సోమవారం సమస్య మరింత జటిలమైంది. జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సరఫరా నిలిపేశారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు కోత విధించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రం మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి కరెంట్ కోత కొనసాగుతోంది. గ్రామాల్లో చీకటి అలుముకుంది. 244 భారీ పరిశ్రమలకు సైతం విద్యుత్ సరఫరా నిలిపేయడంతో యజమానులు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు ఉద్యోగులు సమ్మె విరమించారు.

 కొనసాగిన నిరసన
 విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన సోమవారం రెండో రోజు కొనసాగింది. స్థానిక విద్యుత్ భవన్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రామకృష్ణ మాట్లాడుతూ వేతన సవరణ జీవోను వెంటనే విడుదల చేయాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఏర్పడిన చీకటి కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిరసనలో అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement