నాణ్యతకు నీళ్లు | Sakshi
Sakshi News home page

నాణ్యతకు నీళ్లు

Published Tue, Jan 7 2014 2:04 AM

no quality in Sripada Yellampalli project works

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్: శ్రీపాద(ఎల్లంపల్లి) ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపిస్తోంది. తెలంగాణ ప్రక్రియ వేగవంతం కావడం, సీఎం కిరణ్ త్వరలో ప్రాజెక్టు ను ప్రారంభిస్తారనే ప్రచారం జరగడంతో పను లు వేగవంతం చేసిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రాజెక్టుపై నిర్మించిన రోడ్డు బ్రిడ్జి అప్పుడే పగుళ్లు చూపింది. బ్రిడ్జికి ఇరువైపుల నిర్మించిన రెయిలింగ్ సిమెంట్‌రాలి ఇనుపరాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. రెయిలింగ్ కూలే పరిస్థితి నెలకొంది. ఇక బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టరు నాణ్యతా పాటించకపోవడంతో కింది భాగంలోని స్లాబు పగుళ్లు తేలింది. అందు లో నుంచి నీరు కారుతోంది. ప్రాజెక్టు ను తొందరగా ప్రారంభించడం కోసం పనులు వేగవంతం చేయడం వల్లనే బ్రిడ్జి, సైడ్‌వాల్ పనులను కాంట్రాక్టర్ నాణ్యతా లేకుండా చేపట్టడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు సిమెంటు పనుల తరువాత బ్రిడ్జికి, రెయిలింగ్‌కు సరిపడా నీటిని పట్టించలేదు. దీంతో గట్టిదనం కోల్పోయిన బ్రిడ్జి, రెయిలింగ్‌కు ఉన్న సిమెంటు ఊడుతోంది.
 
 వైఎస్సార్ మరణానంతరం నిర్లక్ష్యం
 మంచిర్యాల మండలం గుడిపేట వద్ద గల గోదావరిపై నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టును తొమ్మిదేళ్ల క్రితం సుమారు రూ. 2,744 కోట్ల వ్యయంతో 21 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మాణాన్ని చేపట్టారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంతంలోని 2 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీటిని, జిల్లా ప్రజల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఈ ప్రాజెక్టును 2004 జూలై 28న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. కాని ఆయన మరణాంతరం నిధుల విడుదలలో పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పనులు మూడేళ్లలో పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడం, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో, తన హయాంలోనే ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం ఉవ్విల్లూరుతున్నారు.
 
 15 రోజుల్లో 15 గేట్ల బిగింపు
 సీఎంతో గత నెల 25న ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటికి 47 గేట్లు బిగించిన అధికారులు కేవలం 15 రోజుల్లో మిగిలిన 15 గేట్లు బిగించారు. అయినప్పటికీ  ప్రాజెక్టు పనులు పూర్తికాకపోవడంతో అదే నెల 31వ తేదీకి ప్రారంభోత్సవాన్ని మార్చారు. దీంతో ప్రాజెక్టుపై బ్రిడ్జి నిర్మాణ పనులు 50వ గేటు వరకు పూర్తి కాగా 5 రోజుల్లో 62 గేట్లు బిగించి ఇరువైపులా రాకపోకలు సాగించేలా రోడ్డును పూర్తిచేశారు. ప్రారంభోత్సవానికి అవసరమైన పైలాన్ పనులు పూర్తికాకపోవడంతో జనవరి 5కు తేదీకి మార్చారు. ఇంతలో మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్పుపై కరీంనగర్ జిల్లాలో ఆందోళనలు చేపట్టడం, తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా సీఎం అడ్డుకోవడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణిం చుకోలేక పోయారు. తాను ప్రారంభోత్సవానికి వస్తే శ్రీధర్‌బాబు మద్దతుదారులు, తెలంగాణవాదులు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితుల నుంచి ప్రతిఘటన తప్పదని గ్రహించిన సీఎం మరోసారి ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.
 
 11న ప్రారంభోత్సవానికి సన్నాహాలు
 ప్రస్తుతం ఈ నెల 11వ తేదీన కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు బ్రిడ్జి రెయిలింగ్ పనులతోపాటు, గేట్లను ఎత్తేందుకు హైడ్రాలిక్ జాకీలను ఏర్పాటు చేస్తున్నారు. పైలాన్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ. వేల కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్న ప్రభుత్వం సీఎంతో ప్రారంభించడానికి తేదీలు ఖరారు చూస్తూ.. వాయిదా వేస్తూ అధికారులను హడావుడికి గురిచేస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు త్వరగా పనులు కావాలని నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే పనులు చేస్తున్నారు. పనులు వేగంగా చేసేందుకు అధిక సంఖ్యలో కూలీలను పెంచడం, పనులను పరిశీలించక పోవడంతో పనుల్లో నాణ్యత లోపిస్తుంది. గతంలో ప్రాజెక్టు పనులను నెమ్మదిగా చేసిన కాంట్రాక్టరు, మరో నాలుగు నెలల్లో చేయాల్సిన పనులను కేవలం 20 రోజుల్లోనే చేపట్టడంతో, కాంక్రీటు పనులు చేపట్టిన తరువాత నీటిని సరిగా పట్టించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే కాంక్రీటుతో చేసిన పనుల్లో సిమెంటు రాలిపోయి, పగుల్లు తేలి అందులోని రాడ్లు కన్పిస్తున్నాయి. ఇప్పటికైన సీఎం ప్రారంభోత్సవ ఏర్పాట్ల నుంచి కాస్త ప్రాజెక్టు పనుల వైపు మరలించి, పర్యవేక్షణ చేపట్టకపోతే పదికాలాల పాటు ఉండాల్సిన ప్రాజెక్టు, కొద్ది రోజులకే కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Advertisement