ఏదీ పునరావాసం | Sakshi
Sakshi News home page

ఏదీ పునరావాసం

Published Wed, Jul 2 2014 12:08 AM

ఏదీ పునరావాసం - Sakshi

ఆగస్టు 15 నాటికి పులిచింతల ప్రాజెక్టు పూర్తిచేసి 11 టిఎంసీల నీటిని నిల్వ ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నట్టు ఓ వైపు  ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు వి.రమేష్‌బాబు ప్రకటిస్తుంటే, మరో వైపు పునరావాస ఏర్పాట్లు జరగక నిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారు. తాము కోరుకున్న చోట కేంద్రాలను ఏర్పాటు చేయని పక్షంలో గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తే లేదని మాచవరం మండలం గోవిందాపురం, రేగులగడ్డ గ్రామస్తులు తేల్చి చెపుతున్నారు.
 
 మాచవరం
 కోరుకున్న చోటే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని గత ఐదేళ్లుగా పులిచింతల ముంపు గ్రామాలైన మాచవరం మండలం గోవిందాపురం, రేగులగడ్డ వాసులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
 నేటికీ వారికి పునరావాస కేంద్రాలను కేటాయించకుండా  అధికారులు కాలయాపన చేస్తున్నారు.
 
 గోవిందాపురం గ్రామానికి చెందిన సుమారు 350 కుటుంబాలకు  ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
 
 అయితే వీరంతా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలోని కరాలపాడు శివారులో తమకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
 
 అప్పటి జిల్లా స్థాయి అధికారులు మాత్రం ఆ ప్రాంతంలో అయితే ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇవ్వలేమని, 1.75 సెంట్ల స్థలం మాత్రమే ఇవ్వగలమని తేల్చి చెప్పారు.
 ఇదిలావుంటే, బెల్లంకొండ మండలం కోళ్లూరు, కామేపల్లి, పులిచింతల, బోదనం గ్రామాలకు చెందిన పులిచింతల నిర్వాసితులకు మాత్రం వారు కోరుకున్న విధంగా కరాలపాడు శివారులో ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున స్థలం కేటాయించి అందించారు.
 
 మాచవరం మండల నిర్వాసితులు తమకూ  అక్కడే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేయడంతో ఆ పరిసర ప్రాంతాల్లోనే  పునరావాసం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ప్రభుత్వం చూసిన భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినది కావడంతో  అధికారులు కోర్టును ఆశ్రయించారు. గత ఐదేళ్లుగా స్థలంపై వివాదం కోర్టులో ఉంది.
 
 దీంతో మాచవరం మండలం గోవిందాపురంలోని సుమారు 350 కుటుంబాలకు, రేగులగడ్డ గ్రామానికి చెందిన వారికి పునరావాసం ఇప్పటికీ ఏర్పాటు కాలేదు.
 
 ఇంకా , 18 సంవత్సరాలు నిండిన వారికి 5 సెంట్ల స్థలం ఇస్తామన్న ప్రభుత్వం హామీ ఇప్పటికీ నెరవేరలేదు.
 
 ముంపు గ్రామాల్లో డిగ్రీ, ఇంటర్ చదివిన విద్యార్థులకు కుటుంబానికి ఒకరికి వంతున ఉద్యోగం  కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదు.
 
 ఇప్పటికే జూలై 15వ తేదీ నాటికి బెల్లంకొండ మండలం పులిచింతల నిర్వాసితులను గ్రామాలను ఖాళీ చేసి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
 న్యాయం చేయాల్సిందే
 మేం కోరుకున్న చోటే  ప్రభుత్వం పునరావాసం కల్పించాలి. లేకుంటే మా గ్రామాన్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదు. ప్రాణాలు ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నాం. పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయాల్సిందే.
 - పాతర్లపాటి వెంకటరెడ్డి, పులిచింతల ముంపు గ్రామాల కమిటీ సభ్యుడు,  గోవిందాపురం
 
 పునరావాస కేంద్రాన్ని
 వెంటనే ఏర్పాటు చేయాలి
 మా గ్రామానికి పునరావాస కేంద్రాన్ని కేటాయించలేదు. మాకు కేటాయించిన స్థల వివాదంపై కోర్టులో సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు జరుగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావస్తుంది. నీళ్లు నిల్వ ఉంటే గ్రామంలో నీరు చేరి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మాకు వెంటనే  పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
 - అన్నపురెడ్డి గంగిరెడ్డి, గోవిందాపురం,
 ముంపు గ్రామ నిర్వాసితుడు
 
 అధికారులు అన్యాయం చేస్తున్నారు ... బెల్లంకొండ మండలంలోని నిర్వాసితులకు జులై 15వ తేదీలోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కామేపల్లిని ఆనుకుని ఉన్న గోవిందాపురం గ్రామానికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఎటువంటి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోగా, రక్షణచర్యలు కూడా చేపట్టలేదు.పూర్తిగా అన్యాయం చేస్తున్నారు.
 - బోళ్ల చంద్రారెడ్డి,
 గోవిందాపురం నిర్వాసితుడు
 

Advertisement
Advertisement